టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ విడాకుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది.ఇద్దరి అంగీకారం మేరకే విడాకుల నిర్ణయానికి వచ్చినట్టు షోయబ్ మాలిక్‌కు అత్యంత సన్నిహితుడు మీడియాకు వెల్లడించాడు. వారిద్దరూ ఇప్పటికే దూరమయ్యారని, విడాకుల పత్రాలు కూడా దాఖలయ్యాయని ఆ మిత్రుడు వెల్లడించినట్టు మీడియా వర్గాలు తెలిపాయి. సానియా ప్రస్తుతం దుబాయ్‌లో ఉండగా.. టీ20 ప్రపంచ కప్ విశ్లేషకుడిగా మాలిక్ పాకిస్థానలో ఉన్నాడు. సానియా ఇటీవల ట్విటర్లో విడుదల చేసిన ఓ ఫొటో, దానికి రాసిన పోస్ట్..ఆమె, షోయబ్ విడిపోనున్నారన్న పుకార్లకు తావిచ్చింది. అయితే అవి నిజమేనని షోయబ్ మిత్రుడొకరు ధ్రువీకరించినట్టు ఓ జాతీయ చానెల్ వెల్లడించింది. అలాగే మాలిక్ వ్యవహారాలు చూసే మేనేజ్మెంట్ సంస్థ సభ్యుడు కూడా విడాకుల విషయాన్ని వెల్లడించాడు. ‘అవును, వారు విడిపోయారన్నది నిజం. ఇంతకంటే వివరాలు వెల్లడించలేను’ అని ఆ సభ్యుడు తెలిపాడు. గతనెల 30న కుమారుడు ఇజాన పుట్టినరోజు సందర్భంగా సానియా, మాలిక్ కలుసుకున్నారు. షోయబ్ పాకిస్థాన నుంచి దుబాయ్ వచ్చి కుమారుడి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాడు. అయితే ఈ వేడుకకు సంబంధించి సానియా చేసిన పోస్ట్‌లలో షోయబ్ ఫొటోలు లేకపోవడం కూడా వారు విడిపోతున్నారన్న వార్తలకు బలం చేకూర్చింది. సానియా, షోయబ్ 12 ఏప్రిల్ 2010లో హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.