పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్, ఇండియా టెన్నిస్ స్టార్ సానియా మిర్జా దంపతులు 12 ఏళ్ల తమ వైవాహిక బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమయ్యారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. కొద్ది రోజులుగా ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదని, సంసారం సాఫీగా సాగడం లేదని ప్రచారం జరుగుతోంది. విడాకుల గురించి వార్తలు వస్తున్నా.. ఇద్దరూ సైలెంట్ గా ఉండటంతో నిజమే అన్న సంకేతాలు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా సానియా మీర్జా చేసిన పోస్ట్‌లు ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. పాకిస్తాన్‌కు చెందిన మోడల్ కమ్ యూట్యూబర్ ఆయేషా ఒమర్‌తో షోయబ్ మాలిక్ పెట్టుకున్నరిలేషన్ సానియా కాపురంలో చీలికలు తెచ్చిందని పాక్ మీడియాలో కథనాలొచ్చాయి. కొన్నాళ్ల క్రితం షోయబ్ మాలిక్‌కు ఆ మోడల్‌తో పరిచయమైందట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందట.
సన్నిహితంగా ఉంటూ మరింత దగ్గరయ్యారన్నది రూమర్ల సారాంశం. మోడల్ ఆయేషా మోజులో పడిన షోయబ్ మాలిక్.. సానియాను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆ మోడల్‌తో షోయబ్ మాలిక్ ఫోటో షూట్ చేశాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమెతో సన్నిహితంగా ఉన్న కారణంగానే సానియా.. షోయబ్‌ను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. పగిలిన హృదయాలు ఎక్కడికి వెళ్తాయి.. అల్లాను చేరేందుకేనా? అంటూ సానియా తన ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్టు విడాకుల బంధానికి మరింత ఆజ్యం పోసింది. అయేషా ఒమర్, షోయబ్‌ల ఫోటో షూట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. నిజానికి సానియా – మాలిక్ మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. వాళ్లిద్దరూ క్లారిటీ కూడా ఇవ్వడం లేదు.