టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో టీమిండియా ఘోర ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ సునాయాసంగా ఛే దించింది. పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అద్భుతంగా ఆడిన ఇంగ్లండ్ జట్టు నవంబర్ 13న పాక్ జట్టుతో ఫైనల్ ఆడనుంది. అడిలైడ్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఫర్వాలేదనిపించినా.. బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు.
ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు కేవలం వికెట్ నష్టపోకుండా టార్గెట్‌ను ఛేదించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ సెంచరీ భాగస్వామ్యంతో టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఇంగ్లండ్ ఓపెనర్లు తమ జట్టుకు విజయం అందించారు. ఈ క్రమంలో హేల్స్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి, భారత్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. అలాగే మరో వైపు నుంచి ఇంగ్లండ్ సారథి బట్లర్ కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏ బౌలర్‌ను బరిలోకి దింపినా ఫలితం లేకుండా పోయింది. హేల్స్ 86, బట్లర్ 80 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. దీంతో ఎన్నో అంచనాలతో సెమీస్ చేరిన టీమిండియా మరోసారి ఫైనల్ చేరకుండానే ఇంటిబాట పట్టింది.
భారత్ బ్యాటింగ్ ఇలా…
ఇక భారత్ బ్యాటింగ్ విషయానికొస్తే ఓపెనర్ కేఎల్ రాహుల్(5) పూర్తిగా నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ నాలుగో బంతికే అతడు అవుటయ్యాడు. 28 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కోహ్లి 40 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. మిడిలార్డర్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ 14 పరుగులు మాత్రమే చేసి అవుట్‌కాగా.. ఐదో స్థానంలో బరిలోకి దిగిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ధాటిగా ఆడాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అతడు 63 పరుగులు సాధించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(6) రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయిన టీమిండియా 168 పరుగులు చేసింది.
మ్యాచ్ స్కోర్లు:
భారత్: 168/6 (20)
ఇంగ్లండ్: 170/0 (16)