ముంబై కొత్త జెర్సీ ఇదే
ఐపీఎల్ మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కూడా వచ్చే ఐపీఎల్ నుంచి కొత్త అవతారంలో
కనిపించనుంది. ఈ ఏడాది మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2023 ప్రారంభం అవనున్న సంగతి
తెలిసిందే. ఈ క్యాష్ రిచ్ లీగ్ 16వ సీజన్‌కు ముందు ముంబై కొత్త నిర్ణయం
తీసుకుంది. తమ జట్టు జెర్సీని మార్చేయాలని డిసైడ్ అయింది. ఈ విషయాన్ని తమ
అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. అలాగే తమ కొత్త జెర్సీ
డిజైన్‌ను కూడా షేర్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ కొత్త జెర్సీ కూడా సూపర్
అంటూ తెగ సంతోషిస్తున్నారు..
పాత బ్లూ, గోల్డ్ డిజైన్ నుంచి మరీ డీవియేట్ అవ్వకుండా ముంబై ఫ్రాంచైజీ కొత్త
జెర్సీని డిజైన్ చేసింది. జెర్సీపై డార్క్, లైట్ బ్లూ కలయికపై గోల్డ్ కలర్
గీతలు కనిపిస్తున్నాయి. కొత్త జెర్సీతో అయినా తమ అదృష్టం మారుతుందని ముంబై
భావిస్తోంది. గతేడాది ఆడిన 14 మ్యాచుల్లోనే ముంబై ఇండియన్స్ కేవలం నాలుగు
మ్యాచులు మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు భాగాన నిలిచింది.
ఇప్పటి వరకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలో నెగ్గిన ముంబై ఫ్రాంచైజీ.. ఈసారి బలంగానే
కనిపిస్తోంది. దానికితోడు రోహిత్, సూర్యకుమార్ యాదవ్ తదితరులు మంచి ఫామ్‌లో
కూడా ఉన్నారు. దీంతో ఈ ఏడాది తమ ఆరో ట్రోఫీ కోసం వేట మొదలు పెట్టనుంది.
అయితే ఈ సీజన్‌కు ముందే ముంబైకి గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా ఈ ఏడాది జరిగే ఐపీఎల్ ఆడటం లేదు. వెన్నునొప్పితో బాధ
పడుతున్న అతనికి కొన్ని రోజుల క్రితమే న్యూజిల్యాండ్‌లో శస్త్రచికిత్స చేశారు.
ఈ ఆపరేషన్ తర్వాత అతను కనీసం ఆరు నెలలపాటు ఆటకు దూరం అవ్వాలని వైద్యులు
తెలిపారు. అతనితోపాటు ఝై రిచర్డ్సన్ కూడా గాయంతో ఈ సీజన్‌కు దూరమైనట్లు
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది. అతను కనీసం ఆరు వారాల పాటు ఆటకు దూరం
అవుతాడని సమాచారం. కాగా, ముంబై ఈ ఏడాది జరిగే ఐపీఎల్లో తమ తొలి మ్యాచ్‌లో
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టనున్న సంగతి తెలిసిందే.