ఆసిస్‌పై ఘన విజయం
న్యూఢిల్లీ: నువ్వానేనా అనే రీతిలో సాగిన మ్యాచ్‌లో భారత్ గెలిచింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య న్యూఢిల్లీ
వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మూడోరోజు ఆదివారం చాలా రసవత్తరంగా
సాగింది. స్పిన్నర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్‌లో ఇండియా జయకేతనం
ఎగురవేసింది. ఆస్ట్రేలియాను మొదటి ఇన్నింగ్స్‌లో 263 రన్స్‌కే కట్టడిచేసిన
భారత స్పిన్నర్లు మరోసారి తమ సత్తా చాటారు. టీమ్ఇండియా బౌలర్ రవీంద్ర జడేజా
విజృంభించడంతో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది.
వరుగా వికెట్లు తీసి ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. స్పిన్‌కు
అనుకూలిస్తున్న పిచ్‌పై జడేజా ఒక్కడే ఏడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
మిగిలిన వికెట్లను సీనియర్ బౌలర్ అశ్విన్ పడగొట్టాడు. దీంతో 115 పరుగుల
విజయలక్ష్యాన్ని భారత్ ముందుంచింది.
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 4 వికెట్లు కోల్పోయి 118 రన్స్ చేసింది.
రోహిత్(31), పుజారా(31 నాటౌట్), కేఎస్ భరత్(23 నాటౌట్), కోహ్లీ(20),
శ్రేయస్(12) రన్స్ చేశారు. దీంతో భారత్ 4 టెస్టుల సిరీస్‌లో 2-0 లీడ్
సాధించింది. మార్చి 1న ఇండోర్‌లో మూడో టెస్టు ప్రారంభం కానుంది.
కాగా, టాపార్డర్ విఫలమవడంతో టీమ్ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకే
ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్ కంటే 1 పరుగు వెనుకపడిపోయింది. ఒకదశలో 137
పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్,
రవిచంద్రన్ అశ్విన్ ఆదుకున్న విషయం తెలిసిందే. అయితే 1 పరుగు ఆధిక్యంతో
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను భారత బౌలర్ రవీంద్ర జడేజా
కంగారుపెట్టించిన విషయం తెలిసిందే.