రోహిత్ శర్మ 9వ టెస్టు సెంచరీ.. కెప్టెన్‌గా మరో అరుదైన రికార్డు
నాగపూర్: రోహిత్ శర్మ టెస్టుల్లో 9వ సెంచరీ నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో
నాగపూర్‌లో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సెంచరీ
చేశాడు. రెండోవ రోజు రెండో సెషన్లో అతను సెంచరీ పూర్తి చేశాడు. నిజానికి
మరో వైపు బ్యాటర్లు వెనుదిరుగుతున్నా.. రోహిత్ మాత్రం ఒంటరిగా స్ట్రోక్
ప్లే కొనసాగించాడు. రోహిత్ సెంచరీలో 14 ఫోర్లు, రెండు సిక్సర్లు
ఉన్నాయి.కెప్టెన్ రోహిత్ ఈ సెంచరీతో ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. అన్ని
ఫార్మాట్లలో సెంచరీలు నమోదు చేసిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు.
టెస్టులు, వన్డేలు, టీ20ల్లో కెప్టెన్‌గా సెంచరీలు చేసిన ఘనతను అతను
దక్కించుకున్నాడు.స్పిన్‌కు అనుకూలిస్తున్న నాగపూర్ పిచ్‌పై ఆస్ట్రేలియా
స్పిన్నర్ మర్ఫీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతానికి అతను ఈ ఇన్నింగ్స్‌లో
నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరో స్పిన్నర్ లియాన్‌కు
కీలకమైన సూర్యకుమార్ యాదవ్ వికెట్ దొరికింది. ఇండియా 67 ఓవర్లలో అయిదు
వికెట్ల నష్టానికి 189 రన్స్ చేసింది. రోహిత్ 103, జడేజా 12 రన్స్‌తో
క్రీజ్‌లో ఉన్నారు.