శనివారం జరిగే ఏసీసీ సమావేశంలో రానున్న స్పష్టత
ఆసియా కప్ 2023 పాకిస్థాన్‌లో జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు టోర్నీకి ఆతిథ్యం
ఇచ్చే బాధ్యతలను పాక్ నుంచి తప్పించే అవకాశం నెలకొంది. భారత క్రికెట్ కంట్రోల్
బోర్డు కార్యదర్శి జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం కోసం బహ్రెయిన్‌లో
ఉన్న సంగతి తెలిసిందే. పాక్ మాత్రం హోస్టింగ్‌ను తప్పించడాన్ని
వ్యతిరేకించింది. నివేదికల ప్రకారం, ఆసియా కప్ కొత్త వేదికపై ప్రస్తుతానికైతే
నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఈసారి ఆసియా కప్ యూఏఈలో నిర్వహించవచ్చని వార్తలు
వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ప్రత్యామ్నాయ వేదిక ఇంకా ఖరారు కానప్పటికీ పాకిస్థాన్ ఈ నిర్ణయంపై తీవ్ర
ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ నుంచి
వైదొలగాల్సి ఉంటుందని పాక్ క్రికెట్ బోర్డు బెదిరించింది. పాకిస్థాన్ క్రికెట్
బోర్డు (పీసీబీ) మాజీ చీఫ్ ఒకరు బీసీసీఐపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వారు ఐసీసీని కూడా ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఏసీసీ చైర్మన్‌గా
ఉన్న బీసీసీఐ సెక్రటరీ జే షా గత అక్టోబర్‌లో టీమ్ ఇండియా పాకిస్థాన్‌కు
వెళ్లడం లేదని కుండబద్దలు కొట్టారు. దీనిపై పీసీబీ కూడా ఘాటుగా స్పందించింది.
అయితే శనివారం జరిగే ఏసీసీ సమావేశంలో ఈ విషయంపై స్పష్టత వస్తుందని భావించారు.
అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.