అసియా కప్ – 2023 టోర్నీ కోసం ఇండియన్ టీమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్థాన్
వెళ్లబోదని, టోర్నీనే మరో చోటుకు తరలిస్తామని గత ఏ డాది ఆసియా క్రికెట్
కౌన్సిల్(ఏ సీ సీ) అధ్యక్షుడు, బీసీ సీఐ సెక్రటరీ జై షా చెప్పడం దుమారం
రేపింది. దీనిపై అప్పటి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజామ్ సేఠీ
తీవ్రంగా స్పందించారు. పీసీబీ ఛైర్మన్ గా ఉన్న నజామ్ సేఠీ తాజాగా ఏసీసీపై
ఒత్తిడి తీసుకొచ్చి ఓ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేయించారు. ఫిబ్రవరి 4వ
తేదీన ఏసీసీ బహ్రెయిన్ లో అత్యవసరంగా సమావేశం కానుంది. ఆసియా కప్ 2023 వేదికపై
నిర్ణయం తీసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మధ్య తాను దుబాయ్ వెళ్లిన
సమయంలో ఏసీసీ సభ్యులను ఈ అత్యవసర సమావేశానికి ఒప్పించినట్లు పీసీబీ ఛీఫ్ నజామ్
సేఠీ వెల్లడించారు.
“ఏసీసీ బోర్డు ఫిబ్రవరి 4న బహ్రెయిన్ లో సమావేశం కానుండటం చాలా పెద్ద
ముందడుగు. ఈ సమావేశంలోనే ఆసియా కప్ కు సంబంధించిన అంశాలను చర్చిస్తాం.
మార్చిలో ఐసీసీ మీటింగ్ కూడా జరగనుంది. ఏసీసీ సభ్యులతో నేను ఏం మాట్లాడాను,
నేను ఏ నిర్ణయం తీసుకున్నాను అన్నది బయటపెట్టను. కానీ ఇండియా, పాకిస్థాన్
క్రికెట్ సంబంధాలు మాత్రం చాలా ముఖ్యం” అని నజామ్ సేఠీ చెప్పారు.
గతేడాది శ్రీలంకలో జరగాల్సిన ఆసియా కప్ తప్పనిసరి పరిస్థితుల్లో యూఏఈకి
తరలించాల్సి వచ్చింది. ఈ ఏడాది ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది.
అయితే దీనికోసం ఇండియన్ టీమ్ అక్కడికి వెళ్లే ప్రసక్తే లేదని బీసీసీఐ
కార్యదర్శి జై షా చెప్పారు. అవసరమైతే పాకిస్థాన్ నుంచే టోర్నీని తరలిస్తామని
కూడా అన్నారు. దీనిపై పాక్ క్రికెట్ బోర్డు గుర్రుగా ఉంది.