సిట్సిపాస్ ను వరుస సెట్లలో ఓడించిన జకోవిచ్
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో జకోవిచ్ కు ఇది 10వ టైటిల్
ఓవరాల్ గా 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్
ఇప్పటిదాకా నాదల్ పేరిట ఉన్న రికార్డు
సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అవతరించాడు. మెల్బోర్న్ లోని రాడ్ లేవర్ ఎరీనాలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో జకోవిచ్ 6-3, 7-6, 7-6తో గ్రీస్ ఆటగాడు స్టెఫానో సిట్సిపాస్ ను వరుస సెట్లలో ఓడించాడు. తొలి సెట్ ను సునాయాసంగా గెలిచిన జకో ఆ తర్వాత రెండు సెట్లలో సిట్సిపాస్ నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. అయితే ఆ రెండు సెట్లు టైబ్రేకర్ వరకు వెళ్లగా జకోవిచ్ పైచేయి సాధించాడు. కాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ లో చాంపియన్ గా నిలవడం జకోవిచ్ కు ఇది పదోసారి. అంతేకాదు, ఈ టైటిల్ తో జకోవిచ్ రాఫెల్ నాదల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన ఆటగాళ్లుగా జకోవిచ్ (22), నాదల్ (22) సమవుజ్జీలుగా నిలిచారు.