కివీస్‌తో చివరి వన్డేలో 90 పరుగుల తేడాతో భారత్ విజయం
ఈ గెలుపుతో 114 పాయింట్లతో వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా భారత్
111 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయిన కివీస్
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన తుది మ్యాచ్‌లో టీమిండియా 90 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. హైదరాబాద్‌లో జరిగిన రెండో వన్డేలో ఓడిన తర్వాత అగ్రస్థానాన్ని కోల్పోయిన కివీస్ రెండోస్థానానికి పడిపోయింది. దీంతో ఇంగ్లండ్‌కు టాప్ ప్లేస్ దక్కింది. మూడో వన్డేకు ముందు తలా 113 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్ వరుసగా ఒకటి, రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇండోర్ వన్డేలో భారత్ విజయం సాధించిన తర్వాత ఈ స్థానాలు తారుమారయ్యాయి. భారత్ 114 స్థానాలతో అగ్రస్థానానికి చేరుకోగా, 113 స్థానాలతో ఇంగ్లండ్ రెండో స్థానానికి పడిపోయింది. 112 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానానికి పరిమితం కాగా, రెండు పాయింట్లు కోల్పోయిన కివీస్ నాలుగో స్థానానికి దిగజారింది. త్వరలోనే ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా జట్లు మూడు వన్డేల సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ సిరీస్‌లో కనుక ఇంగ్లిష్ జట్టు 3-0తో వైట్ వాష్ చేస్తే తిరిగి టాప్ ప్లేస్‌కి చేరుకుంటుంది. కాగా, టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా 267 రేటింగ్ పాయింట్లతో ఇప్పటికే అగ్రస్థానంలో ఉంది. టెస్టు ర్యాంకింగ్స్‌లో మాత్రం 115 పాయింట్లోతో రెండో స్థానంలో ఉంది. 126 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.