వచ్చే నెల 15 వరకు తిరుప్పావై..
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం ధనుర్మాస
ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 6.17 గంటలకు ఉత్సవాలకు
శ్రీకారం చుట్టనున్నారు. జనవరి 15 వరకు నెలరోజులపాటు ఉత్సవాలను
నిర్వహించనున్నారు. సంక్రాతి పండుగకు ముందు చేపట్టే ధనుర్మాసోత్సవాల్లో
గోదాదేవి మనోవల్లభుడైన శ్రీరంగనాథుడిని ఆరాధించే పర్వాలు నిర్వహిస్తారు.
ప్రతిరోజు ఉదయం 4.30 గంటలకు శ్రీ ఆండాల్ అమ్మవారికి ఉత్సవ సేవ
నిర్వహించనున్నారు. ఉదయం 4.30 నుంచి 5.15 గంటల వరకు ఆలయ ముఖమండపంపైన ఉత్తర
భాగంలోని హాల్లో అమ్మవారిని వేంచేయించి తిరుప్పావై కార్యక్రమం
జరిపించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా జనవరి 14వ తేదీ రాత్రి 7 గంటలకు గోదా
కల్యాణం, 15వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఒడి బియ్యం సమర్పణ కార్యక్రమం
నిర్వహిస్తారు.