హైదరాబాద్ : చిన్న, మధ్య తరహా సంస్థలకు సలహాలు, సూచనలు ఇస్తూ సహాయం చేయాలని తైవాన్ వ్యాపార ప్రతినిధి బృందాన్ని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. తైవాన్ భారతదేశ ప్రతినిధి బౌషన్ గేర్ ఆధ్వర్యంలో తైవాన్ వ్యాపార ప్రతినిధి బృందం కేటీఆర్‌తో శుక్రవారం సమావేశమైంది. ఈ సమావేశంలో లైఫ్ సైన్సెస్, ఐసీటీ సహా శక్తివంతమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ తెలంగాణలో ఉందని కేటీఆర్ తైవాన్ బృందానికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ పెట్టుబడులకు బాటలు వేసిందన్నారు. పెట్టుబడులకు అనువైన గమ్యస్థానం హైదరాబాద్ అని స్పష్టం చేశారు. పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భారీ పెట్టుబడులతో వస్తే పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.