హైదరాబాద్: తెలంగాణలో అసలైన రాజకీయ ఆట ఇప్పుడే ప్రారంభమైందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. భాజపా కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నిన్ను వదిలే ప్రసక్తేలేదు. ఇచ్చిన హామీలపై అడుగడుగునా ప్రశ్నిస్తామని హెచ్చరించారు. ప్రధాని మోడీ పర్యటనపై కేసీఆర్ తీరు విచారకరమని మండిపడ్డారు. మహిళా గవర్నర్ను తెరాస సర్కారు పదే పదే అవమానించటాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈడీ, సీబీఐ దాడులతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రధాని పర్యటనకు ఆహ్వానం పలుకుతూ స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రి సీఎం కేసీఆర్కు లేఖ రాశారని తెలిపారు. దేశ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ప్లెక్సీలు ఏర్పాటు చేయటం విచారకరమన్నారు.
ఆయా రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించినప్పుడు కనీస మర్యాద ఇవ్వాలని సూచించారు. రామగుండం బంద్కు పిలుపునిచ్చిన పార్టీలకు ప్రజలు ఎప్పుడో బంద్ ఇచ్చారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే తెలంగాణ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేదా? అని ప్రశ్నించారు. సిట్ ప్రగతి భవన్లో సిట్టయ్యిందని దుయ్యబట్టారు. శనివారం మధ్యాహ్నం ప్రధాని హైదరాబాద్కు రానున్నారు. బీజేపీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగతాన్ని స్వీకరించేందుకు విమానాశ్రయం బయటకు వచ్చి కార్యకర్తలనుద్దేశించి మోడీ ప్రసంగిస్తారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో రామగుండం వెళ్తారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ వేదిక నుంచే జాతీయ రహదారులు, రైల్వే పనులకు సంబంధించిన పనులను ప్రారంభిస్తారు. రూ.9,500 కోట్ల విలువైన పనులను ప్రజలకు అంకితం చేస్తారని కిషన్రెడ్డి వెల్లడించారు.