తెలంగాణ ప్రజలు బిజెపి కుట్రలను గమనిస్తున్నారు
80% ఉన్న బీసీలకు కనీసం మినిస్ట్రీ ఇవ్వని దుర్మార్గపు పార్టీ బిజెపి
నీరవ్, లలిత్ మోడీ, విజయ్ మాల్యా లక్షల కోట్లు ఎగ్గొట్టి లండన్ లో దర్జాగా తిరుగుతున్నారు
బ్యాంకులకు కన్నం వేసిన వాళ్లను మొదట పట్టుకు రండి
– లండన్ నుంచి రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్
లండన్, నవంబర్ 10:
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవాన్ని తట్టుకోలేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బీసీ నేతలపై అక్రమ కేసులు, ఈడి ఐటి పేరిట దాడులకు తెగబడుతోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక, యువజన సర్వీసులు పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బ్యాంకుల్లో రుణాల పేరిట కోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యాల వంటి మోసగాళ్లను మొదట దేశానికి పట్టుకు రావాలని సవాల్ విసిరారు.
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పై అక్రమంగా ఈడి, ఐటి దాడులు చేయడంపై మంత్రి స్పందించారు. మునుగోడు ఓటమి భరించలేక బీసీ నేతలపై బిజెపి కుట్రలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే గ్రానైట్ వ్యాపారంలో ఉన్న మంత్రి గంగుల కుటుంబంపై కక్ష కట్టి ఐటీ దాడులు చేస్తున్నారని, బలహీన వర్గాల మంత్రి కాబట్టే ఐటీ దాడులని అన్నారు. దేశాన్ని అదాని, అంబానీకి గంప గుత్తగా అప్పగించిన మోదీ ప్రశ్నించే శక్తులపై సిబిఐ, ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాడని విమర్శించారు. గంగుల కమలాకర్ కు అన్ని విధాల అండగా ఉంటామని ఈడి, ఐటిలకు బెదరబోమని స్పష్టం చేశారు
ఈడి, ఐటిలను ఉసిగొలిపి దొంగ దాడులు చేసి తెలంగాణ నేతలను అణగదొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. బిజెపి నేతల తాటాకు చప్పుళ్ళకు బెదిరేదే లేదని హెచ్చరించారు. యావత్ తెలంగాణ సమాజం మీ కుట్రలను గమనిస్తున్నారని అన్నారు. లక్షల కోట్లు అక్రమంగా ఆర్జిస్తున్న అనేకమంది ధనవంతులు ఉండగా కేవలం బీసీ నేతనే టార్గెట్ చేయడం బిజెపి నేతలకే చెల్లిందని తెలిపారు. మొదటి నుంచి బిజెపి బీసీలకు వ్యతిరేకంగానే ఉందని అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు. దేశంలో 80% ఉన్న బీసీలకు కనీసం మినిస్ట్రీ ఇవ్వని దుర్మార్గపు పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బిజెపి మాత్రమేనని స్పష్టం చేశారు.
నేను ఉన్న ఈ లండన్లోనే ఐపిఎల్ స్కాంలో కోట్లు కొల్లగొట్టిన లలిత్ మోదీ ఉన్నాడు… వజ్రాల వ్యాపారంతో బ్యాంకులను కోట్ల రూపాయలకు ముంచిన నీరవ్ మోదీ ఉన్నాడు… బ్యాంకులను 9వేల కోట్లు ముంచిన విజయ్ మాల్యా ఇక్కడే ఉన్నారని… బిజెపికి, మోదీకి చిత్తశుద్ది ఉంటే ముందుగా ఈ ముగ్గురిని పట్టుకుని ఇండియాకు తీసుకురావాలని అన్నారు. ఈ ముగ్గురిని పట్టుకువస్తే తెలంగాణ లాంటి 10 రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. ఈ ముగ్గురితోపాటు అమీ మోదీ, నీషల్ మోదీ, మోహుల్ చౌస్కి, జతిన్ మెహతా, చేతన్ జయంతిలాల్, నితిన్ జయంతిలాల్, ఆశిష్ జోబన్ పుత్ర, రితేష్ జైన్, సురేందర్ సింగ్, హర్సాహీబ్ సింగ్, సభ్యసేత్, సంజయ్ బండారి, నీలేష్ పారిక్ సహా 72 మంది బడా వ్యాపారవేత్తలు లక్షలాది కోట్ల మేర బ్యాంకులకు మోసం చేసి విదేశాలకు పారిపోయారని సాక్షాత్తు విదేశీ మంత్రిత్వ శాఖ పార్లమెంటులో తెలియజేసిందని మంత్రి గుర్తు చేశారు. ఈ బడా ఎగవేత దారులు… లక్షల కోట్లు ఎగ్గొట్టి లండన్ లో దర్జాగా చట్టా పట్టాలేసుకుని తిరుగుతుంటే ఇన్నేళ్లుగా కేంద్రంలోని బిజెపి సర్కారు కేవలం చోద్యం చూడడానికే పరిమితమైందని విమర్శించారు. మీకు నిజంగా అవినీతిని ఎదిరించే దమ్మూ ధైర్యం ఉంటే… బ్యాంకులకు కన్నం వేసి లండన్ లో ఉన్న వీళ్లను మొదట పట్టుకు రండని అన్నారు. ఈ అక్రమార్కులందరినీ దేశం వదిలి పారిపోయేలా చేసి తెలంగాణ పై కక్షగట్టి కేంద్రం శిఖండి రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. లాభాల్లో ఉన్న సంస్థలను గంపగుత్తగా తమ అనుచర గణానికి గంపగుత్తగా అప్పజెప్పి ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శించారు.
తమ మాట వినని రాష్ట్రాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతారని, ప్రభుత్వాలను అస్థిర పరచడానికి, కూల్చడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారని, ఆ విధంగా భారత రాజకీయాలకు బిజెపి కొత్త బాష్యం చెబుతున్నదని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ జరుగుతుంటే బిజెపి కోర్టుకు ఎందుకు ఎక్కుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో వారి బండారం బయటపడుతుందనే భయం బిజెపి నేతల్లో ఉందన్నారు. అందుకే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.