న్యూఢిల్లీ : ఎమ్మెల్యే, ఎంపీ లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు. ‘స్వాగతం..గొప్ప తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చింది. ఇకపై దేశంలో స్వచ్ఛమైన రాజకీయాలు కొనసాగుతాయని, వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని సోషల్ మీడియా ఎక్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పోస్ట్ చేశారు. 1993లో ప్రధాని పీవీ నరసింహా రావు ప్రభుత్వం అవిశ్వాన్ని ఎదుర్కొంది. జేఎంఎం ఎంపీ శిబు సోరెన్ సహా ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు లంచాలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. లంచం తీసుకొని అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో మైనార్టీలో ఉన్న పీవీ ప్రభుత్వం గట్టెక్కింది. తర్వాత శిబు సోరెన్ సహా ఐదుగురు ఎంపీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణ జరిగింది. ఆ కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం 1998లో అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసును సోమవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం విచారించి సంచలన తీర్పును ఇచ్చింది. లంచం తీసుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు విచారణ ఎదుర్కొవాల్సిందేనని స్పష్టం చేసింది. లంచం కేసుల్లో ప్రజా ప్రతినిధులకు రాజ్యాంగ రక్షణ కల్పించలేమని తేల్చిచెప్పింది. అసెంబ్లీ, పార్లమెంట్లో ప్రశ్నలు వేసేందుకు లంచం తీసుకున్న విచారణను ఎదుర్కోవాల్సిందేనని తెగేసి చెప్పింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు.