స్కాలర్షిప్ సంఖ్యను పెంచాలి…టెట్ పరీక్షలు నిర్వహించాలి
ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలి
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డితో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య భేటీ
హైదరాబాద్ : రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డితో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య శుక్రవారం ప్రజా భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థుల పలు అంశాలపై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నా రెడ్డికి ఆర్ కృష్ణయ్య వినతి పత్రాలను అందజేశారు. బీసీ విద్యార్థులకు అందజేస్తున్న విదేశీ విద్య స్కాలర్షిప్ సంఖ్యను 300 నుంచి కనీసం 1000 మందికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన చిన్నారెడ్డిని కోరారు. బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ మంజూరై విదేశాల్లో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్ కృష్ణయ్య కోరారు. 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో బీ.ఇడీ, డీ.ఇడీ పూర్తిచేసిన దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులకు టెట్ పరీక్షలు నిర్వహించాలని, అందుకు నోటిఫికేషన్ జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన చిన్నారెడ్డిని కోరారు. టెట్ పరీక్ష పాస్ అయితే తప్ప డీఎస్సీ పరీక్షకు అర్హత ఉండదని ఆయన గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ విద్యార్థులకు గత మూడు సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం మంజూరు చేయడం లేదని, దీంతో విద్యార్థులకు సొంతంగా ఫీజులు చెల్లించాలని కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి పెంచుతూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. గత మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న 4000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని చిన్నారెడ్డిని కృష్ణయ్య కోరారు. ఈ భేటీలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, అనంతయ్య, రాజేందర్, రామకృష్ణ, రాజు, తదితరులు పాల్గొన్నారు.