బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో అవినీతి అక్రమాలు తప్ప ప్రజాసంక్షేమం ఎక్కడా లేదని విమర్శ
తెలంగాణ పసుపు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోందని వెల్లడి
దేశ ముఖ చిత్రాన్ని మార్చే శక్తి బీజేపీకి మాత్రమే వుందని వ్యాఖ్య
హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం కొమురం బీమ్ క్లస్టర్ విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ పాలనలో అవినీతి అక్రమాలు తప్ప ప్రజా సంక్షేమం ఎక్కడా లేదని విమర్శించారు. ఇక్కడ సాగు అవుతోన్న పసుపు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోందన్నారు. దేశంలో రూ.2 లక్షల కోట్లతో రోడ్లను ఎక్స్ప్రెస్ హైవేలుగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడితేనే వ్యాపార, వాణిజ్య రంగాలు పర్యాటకరంగ అభివృద్ధికి దోహదపడతాయన్నారు. దేశ ముఖ చిత్రాన్ని మార్చే శక్తి బీజేపీకి మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో అనేక గ్రామాలు అధ్వానంగా తయారయ్యాయని మండిపడ్డారు. రోడ్లు, తాగు నీరు సౌకర్యాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు అందుబాటులో లేక అనేక గ్రామాలు ఖాళీ అయ్యాయన్నారు. రోడ్ల నిర్మాణాల కోసం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అందుబాటులోకి తెచ్చామన్నారు. విమానాలకు ఇంధనం అందించే సామర్థ్యం మన రైతుల్లో ఉందని చెప్పారు. రైతులకు ఆర్థిక చేయూతనిచ్చి వారిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు