జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సభ్యులకు త్వరలో న్యాయం
సీఎం రేవంత్ రెడ్డి కి జర్నలిస్టుల సంక్షేమం గురించి పూర్తిగా అవగాహన
జర్నలిస్టులకు ఇవ్వాల్సిన ఇండ్ల స్థలాల విషయంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశాలు
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జర్నలిస్టుల అవసరాలు, వారికి అందాల్సిన సంక్షేమం గురించి పూర్తిగా అవగాహన ఉందని, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్సు రవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ గా గురువారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రిని రెండు రోజుల క్రితం కలసి ధన్యవాదాలు తెలిపిన సందర్భంలో రాష్ట్ర జర్నలిస్టుల సమస్యల గురించి క్షుణ్ణంగా చర్చించినట్లు తెలిపారు. జర్నలిస్టులకు ఇవ్వాల్సిన ఇండ్ల స్థలాల విషయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ స్థలాలను గుర్తించవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తున్న దని తెలిపారు.
హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సభ్యులు ఒక్కొక్కరు తమకు రావలిసిన ఇళ్ల స్థలాల కోసం 17 సంవత్సరాల క్రితం రెండులక్షల రూపాయలు కట్టారని, వారికి ఇవ్వాల్సిన ఇంటి స్థలాలు వెంటనే ఇవ్వడానికి కృషి చేస్తానని అన్నారు. గత 17 సంవత్సరాల లో దాదాపు 60 మంది జర్నలిస్టులు ఇంటి స్థలాలు అందకుండానే చనిపోయారని గుర్తు చేశారు. హైదరాబాద్ లో పని చేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఒకే చోట కాకుండా నగరానికి నాలుగు వైపుల గుర్తించి ఎవరికి ఎక్కడ ఇష్టముంటే అక్కడనే ఇస్తే బాగుంటుందని అన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు అన్ని ఆసుపత్రులలో పనిచేసే విధంగా ఆదేశాలు ఇచ్చేలా కృషి చేస్తానని అన్నారు. లేదా జర్నలిస్ట్ కూడా కొంత సొమ్మును హెల్త్ కార్డు కోసం కట్టి మంచి చికిత్స అన్ని ఆసుపత్రులలో పొందే విధంగా ప్రయత్నిస్తామని అన్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్, ఇంటి స్థలం, హెల్త్ కార్డు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రిముఖ్య పౌర సంబంధాల అధికారి, అయోధ్య రెడ్డి, జర్నలిస్ట్ పక్షపాతి అని, ఆయన సహకారంతో జర్నలిస్టులకున్న సమస్యలను అధిగమించడానికి కృషి చేస్తానని అన్నారు. పత్రిక యాజమాన్యాలను పక్కనపెట్టి పత్రికా విలేకరులు జర్నలిజం ప్రమాణాలను పెంచడానికి కృషి చేయాలని అన్నారు. ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్నది కనుక విలేకరులు జాగ్రత్తగా రిపోర్టింగ్ చేసి ప్రజా పక్షపాతిగా పనిచేయాలన్నారు. ఇండ్ల స్థలాల విషయంలో న్యాయపరమైన ఇబ్బందులు ఉంటే అడ్వకేట్ జనరల్ సలహా తో పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి సలహా ఇచ్చారని అన్నారు. మీడియా అకాడమీ కి కావాల్సిన బడ్జెట్, కార్యాలయానికి కావాల్సిన భవనం, అవసరమైన సిబ్బంది, అన్ని సౌకర్యాలు అందించే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి తన ముఖ్య కార్యదర్శిని ఆదేశించారని తెలిపారు.
ముఖ్యమంత్రి ముఖ్య పౌర సంబంధాల అధికారి, అయోధ్య రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇవ్వాల్సిన ఇండ్ల స్థలాల విషయంలో కొంత కాలయాపన జరిగిన విషయం వాస్తవమని, వారికి గౌరవప్రదంగా రావలసిన ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని అన్నారు, త్వరలోనే దీనిని పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. సమాచార పౌర సంబంధాల శాఖ, ప్రత్యేక కమిషనర్, హనుమంతరావు మాట్లాడుతూ జర్నలిజం లో పుట్టి, పెరిగి వారి అవసరాల గురించి క్షణం క్షణం ఆలోచించే వ్యక్తి శ్రీనివాసరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ గా రావడం జర్నలిస్టుల అదృష్టమని అన్నారు. సమాజంకోసం తపించే వ్యక్తి జర్నలిస్ట్ అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మానవీయ కథనాలు ఎన్నో రాసి ప్రభుత్వం దృష్టికి, సమాజం ఉన్న లోటుపాట్లను తెచ్చేవాడు జర్నలిస్టు, అట్టి సమాజసేవకుడికి సదుపాయాలు కల్పించడానికి, అధికారిగా తన బాధ్యతలు నిర్వర్తి స్తానని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ సంపాదకులు రామచంద్ర మూర్తి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఆంధ్రజ్యోతి సంపాదకులు, శ్రీనివాస్, సియాసత్ ఉర్దూ దిన పత్రిక సంపాదకులు, ఆమెర్ అలీ ఖాన్, అకాడమీ సెక్రటరీ, నాగులపల్లి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. యూనియన్ నాయకుడు విరాహాత్ అలీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహారించారు.