లండన్ : సీఎం కేసీఆర్ దూరదృష్టి కారణంగానే ప్రపంచ పర్యాటక యవనికపై తెలంగాణ పర్యాటకం తనదైన ప్రత్యేకతను చాటుతోందని పర్యాటక శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ పర్యాటకాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తొలిసారిగా లండన్ లో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు 3 రోజుల పాటు జరుగుతున్న వరల్డ్ టూరిజం మార్ట్ లో తెలంగాణ రాష్ట్రం సైతం పాల్గొంటున్నదని ఆయన లండన్ నుంచి వెల్లడించారు. 125 దేశాల ప్రతినిధులు, మన దేశం నుంచి 15 రాష్ట్రాలు పాల్గొంటున్న ఈ పర్యాటక ప్రదర్శనలో తెలంగాణ పర్యాటక రంగాన్ని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తామని తెలిపారు. గతంలో విశ్వవేదికలపై జరిగే పర్యాటక ప్రదర్శనల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే స్టాల్ లో మన రాష్ట్రం కూడా పాల్పంచుకునేదని, సీఎం కేసీఆర్ ఆదేశాలతో తొలిసారిగా మన పర్యాటక స్టాల్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. లండన్ వరల్డ్ టూరిజం మార్ట్ (డబ్ల్యూటీఎం) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అక్కడి నుంచి తమ సందేశాన్ని అందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పర్యాటక రంగాన్ని సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని ఆయన తెలిపారు.
సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి, అక్కడ పర్యాటక సొబగులను తీసుకువచ్చారన్నారు. గతంలో సమైక్య రాష్ట్రంలో ఏమాత్రం పట్టించుకోనే పరిస్థితుల్లో ఉన్న రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు. తెలంగాణలోని రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్, కుతుబ్ షాహీ టోంబ్స్, ఆసియా ఖండంలో అతిపెద్ద బుద్ధిజం ప్రాజెక్ట్ బుద్ధవనం, యాదాద్రి టెంపుల్, మన్యంకొండ, వేయి స్తంభాల గుడి, సమ్మక్క సారాలమ్మ, ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ ఎకో పార్క్ అయిన కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్, కాళేశ్వరం ప్రాజెక్ట్, చారిత్రక వరంగల్ కోట వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల ఛాయాచిత్రాల ప్రదర్శనను డబ్ల్యూటీఎం వేదికగా ప్రదర్శిస్తున్నామని అన్నారు. ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైన పోచంపల్లి చిత్ర ప్రదర్శనను సైతం ఈ వేదికపై ఏర్పాటు చేసిటన్లు మంత్రి వివరించారు. అద్భుతమైన ప్రదేశాలు, చరిత్ర, మన బతుకమ్మ, వారసత్వ సంపదను ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిసే విధంగా ఈ వరల్డ్ ట్రావెల్ మార్ట్ లో అంతర్జాతీయ స్థాయిలో తగిన ప్రచారం నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా పురావస్తు కట్టడాలను తిలకించేందుకు పర్యాటకలు అత్యంత ఆసక్తి చూపిస్తారని, తెలంగాణలోని ప్రసిద్ధ పురావస్తు కట్టడాల సందర్శనకు ఈ ప్రదర్శన ఫలితంగా పర్యాటకులు భారీగా పెరుగుతారని అంచనా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ పర్యాటక రంగానికి ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపును తీసుకువచ్చి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో పర్యాటక రంగం ఎలా అభివద్ధి చెందుతున్నదో కూడా తాము అధ్యయనం చేశామని, తెలంగాణ పర్యాటకం సైతం అదే స్థాయికి చేరుకునేలా కృషి చేస్తున్నామని తెలిపారు. విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగి పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వల్ల రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
టూరిజం ప్రమోషన్ కోసం రోడ్ షో
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు లండన్ వీధుల్లో తెలంగాణ పర్యాటక బృందం ప్రత్యేకంగా ఒక రోడ్ షో నిర్వహిస్తున్నట్లు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.