రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 26 : హైదరాబాద్ లోని డాక్టర్ మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే విజ్ఞాపనలను త్వరిత గతిన పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ఒక కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ప్రజావాణి కార్యక్రమ నిర్వహణ, ఈ కార్యక్రమంలో వచ్చే విజ్ఞాపనలపై సచివాలయంలో నేడు సాయంత్రం సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నా రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామ కృష్ణ రావు, కార్మిక, ఉపాధి కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, ప్రజావాణి నోడల్ అధికారి దివ్య తదితర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ ప్రజా భవన్ లో ప్రతీ వారం రెండు రోజుల పాటు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజానీకానికి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని అన్నారు. ఇప్పటి వరకు వచ్చిన పిటీషన్లను సంబంధించి పరిష్కారానికి గాను జిల్లా స్థాయిలో తగు నిర్ణయం తీసుకోవడం, అవసరమైతే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడానికి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో పోలీస్, పంచాయితీ, రెవెన్యూ తదితర శాఖల అధికారులను సభ్యులుగా నియమించాలని పేర్కొన్నారు. ఈ కమిటీ విధి విధానాలను వెంటనే రూపొందించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ను ఆదేశించారు. ఇకనుండి, ప్రజావాణి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నా రెడ్డి ప్రత్యేక్షంగా పర్యవేక్షిస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి పేర్కొన్నారని మంత్రి తెలియజేశారు. ఆరోగ్య పరమైన సమస్యలతో వచ్చే వారికీ వెంటనే సంబంధిత ఆసుపత్రులకు పంపించి సత్వర చికిత్సలు అందే విధంగా తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రజావాణికి అందే ఫిర్యాదులలో పోలీస్ శాఖ కు కూడా సంబంధం ఉన్నవి కూడా అధికసంఖ్యలో వస్తున్నందున, ప్రజావాణికి ఒక సీనియర్ పోలీస్ అధికారిని నియమించాలని తెలియజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నా రెడ్డి మాట్లాడుతూ, ప్రజావాణిలో అందే ఫిర్యాదులను పరిష్కరించడంలో అత్యంత ప్రాధాన్యతనివ్వాలని అధికారులను కోరారు. ఈ ప్రజావాణికి ఉద్యోగ, ఉపాధి కల్పనకై అధిక సంఖ్యలో విజ్ఞాపనలు వస్తున్నందున ప్రతీ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టనున్న రెండు లక్షల ఉద్యోగాల నియామకాలపై కూడా వారికి అవగాహన కల్పించాలని డా.చిన్నారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమంపై, అందిన ఫిర్యాదులపై చేపట్టిన చర్యలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజావాణి నోడల్ అధికారి దివ్య వివరించారు.