మీడియా అకాడమీ చైర్మన్ నియామకంపై ఉత్తర్వులు జారీ
రెండేళ్ల పాటు పదవిలో ఉండనున్న శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇటీవల కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో కొనసాగుతున్న వారు కొందరు స్వచ్ఛందంగా రాజీనామా చేయగా, కొందరిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగించింది. ఈ నేపథ్యంలో ఆయా ఖాళీల్లో కొత్త వారిని నియమిస్తోంది. తాజాగా, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా సీనియర్ పాత్రికేయుడు కె.శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. ఈ నియామకంపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎమ్.హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవికి కేబినెట్ హోదా ఉంటుంది. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ పదవిలో కె.శ్రీనివాస్ రెడ్డి రెండేళ్ల పాటు కొనసాగుతారు. ఇప్పటివరకు అల్లం నారాయణ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన స్థానంలో కె.శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపడతారు. శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ప్రజాపక్షం పత్రిక సంపాదకుడిగా ఉన్నారు. ఆయన గతంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) సెక్రటరీ జనరల్ గానూ, విశాలాంధ్ర పత్రిక ఎడిటర్ గానూ వ్యవహరించారు.