హైదరాబాద్ : అంబేడ్కర్ స్ఫూర్తితో రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ఈశ్వరీబాయి ఆరోజుల్లోనే గీతారెడ్డిని డాక్టర్ చదివించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాంస్కృతికశాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంధ్రభారతిలో జరిగిన ఈశ్వరీబాయి 33వ వర్ధంతి కార్యక్రమంలో సీఎం, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడం తన బాధ్యతగా భావించినట్టు సీఎం చెప్పారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గీతక్క క్రియాశీలకంగా పనిచేశారని, ఆరోగ్య సమస్యలను పక్కనపెట్టి పార్టీకి సేవలందించారన్నారు. అందుకే ఆమె ఇన్ఛార్జిగా ఉన్న నల్గొండ జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచామని చెప్పారు. గీతక్క మంత్రి వర్గంలో లేకపోవడం ఒక లోటుగా భావిస్తున్నామని, ఏ అవకాశం ఉన్నా వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు.