ములుగు : నాలుగు రోజులపాటు అట్టహాసంగా సాగిన మేడారం మహాజాతర ముగిసింది. జనం వీడి సమ్మక్క-సారలమ్మ తిరిగి వన ప్రవేశం చేశారు. దీంతో జాతర అధికారికంగా పరిసమాప్తం అయ్యింది. అమ్మలు వనానికి కదిలే వేళ మేడారంలో చిరుజల్లులు ఆహ్వానం పలికాయి. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. జాతర ప్రాంగణంలోని విద్యుత్తు దీపాలను ఆర్పేసి వెన్నెల కాంతిలో గద్దెల వద్ద తుది పూజలు నిర్వహించారు. ఈ మహా ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరోవైపు అమ్మల దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. గద్దెల ప్రాంగణం రోజంతా కిక్కిరిసిపోయింది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు సమర్పించుకున్నారు. తిరుగు ప్రయాణాలతో ఆర్టీసీ ప్రాంగణం కిటకిటలాడుతోంది. జాతర ముగిసినా మేడారానికి భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 1.40 కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్టు అంచనా.