తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మేడారం, సమ్మక్క-సారలమ్మలను దర్శించుకొన్నారు. సీఎంకి మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, ఇతర ప్రభుత్వాధికారులు స్వాగతం పలికారు. అనంతరం వనదేవతలకు రేవంత్ మొక్కులు చెల్లించుకొన్నారు. ఈసందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను కోరుకున్నట్లు తెలిపారు. తనకు ములుగు జిల్లాతో, మంత్రి సీతక్కతో ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్న సీఎం.. హాథ్ సే హాత్ జోడో యాత్రతో పాటు ఇతర ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే ప్రారంభించినట్లు తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రూ.110 కోట్లు మంజూరు చేశామని వివరించారు. ప్రతి మూలాన ఉన్న ప్రజలకు ప్రజాపాలన చేరువవుతోందన్నారు. మరోవైపు జాతీయ పండుగగా మేడారంను ప్రకటించడం సాధ్యం కాదని కిషన్‌రెడ్డి అనడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. కుంభమేళాను జాతీయ పండుగగా నిర్వహిస్తోన్న కేంద్రం గిరిజన జాతరను చిన్న చూపు చూడటం తగదని రేవంత్‌రెడ్డి సూచించారు. దక్షిణాది కుంభమేళా మేడారం జాతరకు కేవలం రూ.3 కోట్లు కేటాయించిన కేంద్రం.. కుంభమేళాకు మాత్రం వందల కోట్లు నిధులు విడుదల చేసిందని గుర్తు చేశారు. జాతర పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న తీరు.. తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందనేందుకు నిదర్శనమని సీఎం ఆరోపించారు. ప్రధాని మోడీ, అమిత్‌షాను మేడారం జాతరకు ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. అయోధ్యలో రాముడిని దర్శించుకోవాలని మోడీ, అమిత్‌షా చెప్పారు. అయోధ్యలో రాముడి మాదిరిగానే సమ్మక్కను కూడా వారిద్దరూ దర్శించుకోవాలని తెలిపారు. ఇక అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ మేడారం సందర్శించక నిర్లక్ష్యం చేయడం వల్ల భారీ మూల్యం చెల్లించుకొన్నారని విమర్శించారు. కిషన్‌రెడ్డి భవిష్యత్తులో మీకు అదే పరిస్థితి వస్తుందని వెల్లడించారు. కేంద్రం ఉత్తర భారతం, దక్షిణ భారతం అంటూ వివక్ష చూపడం సరికాదని రేవంత్ అన్నారు. పాలకులు ప్రజలను పీడించినప్పుడు ఎవరో ఒకరు నిలబడతారన్న విషయాన్ని నిరూపించిన సమ్మక్క, సారలమ్మ నుంచి స్ఫూర్తి పొంది పోరాడాం విజయం సాధించామన్నారు. తద్వారా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.