దిగిపోయే ముందు ప్రజాధనానికి గండి
రూ. 25 కోట్లు ఖర్చు చేస్తూ హెలీకాప్టర్లు తీసుకున్నారు
ప్రధాన మంత్రికి తప్ప ఎన్నికల సమయంలో ప్రభుత్వ హెలీకాప్టర్లు వాడే హక్కు ఎవరికీ లేదు
జగన్ రెడ్డికి ఉన్న భద్రతా కారణాలు ఏంటో ప్రజలకు చెప్పాలి
ప్రజా ధనం దుర్వినియోగంపై విచారణ చేపడతాం
బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవు
తాడేపల్లిగూడెం జనసేన, టీడీపీ సభ రాష్ట్రానికి దిక్సూచి అవుతుంది
తాడేపల్లిగూడెంలో మీడియాతో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు పరిశీలన
తాడేపల్లిగూడెం : మరో 45 రోజుల్లో దిగిపోయే ముఖ్యమంత్రి రూ. 25 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసి రెండు హెలీకాప్టర్లు తీసుకోవడం కచ్చితంగా బాధ్యతారాహిత్యమని జనసేన పార్టీ రాజకీయ వవ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ వాహనాలు వాడరాదన్న చట్టాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం ఉల్లంఘించిందన్నారు. ఎన్నికల సమయంలో భద్రతా కారణాలతో ప్రభుత్వ హెలీకాప్టర్లు వాడే అవకాశం కేవలం ప్రధాన మంత్రికి మాత్రమే ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి ఈ రకం భద్రతా కారణాలతో ఎందుకు ఇబ్బంది పడుతున్నారో, ఎందుకు ప్రజల డబ్బు దుర్వినియోగం చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం వద్ద జనసేన, టీడీపీ ఉమ్మడిగా నిర్వహించబోయే బహిరంగ సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. సభ ఏర్పాట్లపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ “సమాజంలో పెత్తందార్ల కోసం పని చేసే ఈ ముఖ్యమంత్రి ప్రజాధనంతో, వ్యక్తిగత భద్రత పేరు చెప్పి రెండు హెలీకాప్టర్లు తీసుకున్నారు. ఈ పోకడలను ఖండిస్తున్నాం. ప్రజల డబ్బుని పార్టీ కోసం, ఎన్నికల ప్రచారం కోసం ఎలా వినియోగిస్తారో చెప్పాలి? ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యక్రమాల వేదికలన్నింటినీ కూడా- ఈ ముఖ్యమంత్రి రాజకీయ అంశాల కోసం, ప్రతిపక్ష నేతలను విమర్శించడం కోసమే వినియోగించారు. ఇప్పుడు సిద్ధం అని సభలు నిర్వహించుకుంటున్నారు. ఇంత అవినీతి చేసిన ఈ ముఖ్యమంత్రి తన డబ్బులతో హెలీకాప్టర్లు పెట్టుకోలేకపోయారా? ప్రభుత్వ నిధులతో అద్దెకు తీసుకుంటున్న హెలికాప్టర్ల వ్యవహారం వెనుక ఉన్న అధికారులు కచ్చితంగా బాధ్యత వహించాలి. ప్రభుత్వం మారిన తర్వాత ఈ వ్యవహారంపై విచారణ జరుపుతాం. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. వైసీపీ ప్రభుత్వం ఏ చట్టం పాటిస్తుందో చెప్పాలి. రాజకీయ లబ్ది కోసం ప్రజాధనాన్ని వృథా చేయటం ఏంటి? ఈ వ్యవహరాన్ని వదిలిపెట్టం. ప్రజా క్షేత్రంలో ప్రశ్నిస్తామన్నారు.
బహిరంగ సభ రాష్ట్ర ప్రజలకు అంకితం : ఈ నెల 28న తాడేపల్లిగూడెం వద్ద జనసేన, తెలుగుదేశం పార్టీలు సంయుక్తంగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఈ సభ ద్వారా జనసేన, టీడీపీ అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పొత్తులో భాగంగా ఎలా ముందుకు వెళ్తామనే అంశాన్ని వివరిస్తారు రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నామన్న విషయాన్ని వివరిస్తారు. పారదర్శకతతో కూడిన ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నామనేది తెలుపుతారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులను ఆహ్వానిస్తున్నాం. సభా వేదికపై ఇరు పార్టీల నుంచి 250 మంది చొప్పున ఆశీనులయ్యే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నాం. యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేస్తాం. ఈ సభకు వచ్చే ప్రజానీకానికి- పార్కింగ్ నుంచి అన్ని ఏర్పాట్లు పొరపాట్లు లేకుండా సభకు వచ్చిన వారంతా సురక్షితంగా తిరిగి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంపై విసుగెత్తిపోయిన ప్రజలు వారి తరఫున గళం విప్పబోయే ప్రతి ఒక్కరినీ అభినందించబోతున్నారు. ఎన్నికల ప్రణాళిక గురించి ఇరు పార్టీల నేతలు సభా వేదిక నుంచి వివరిస్తారు. ప్రతి ఒక్కరు గర్వపడే విధంగా ప్రాంతీయ సంస్కృతి ఉట్టిపడే విధంగా కళాకారులను ప్రోత్సహించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నాం. ఈ సభను రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తున్నాం. సభకు రాష్ట్ర ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. సభకు సువిశాల ప్రాంగణాన్ని ఇచ్చిన కృష్ణమూర్తి కి పవన్ కళ్యాణ్ తరపున ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి, తాడేపల్లిగూడెం ఇంఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, పీఏసీ సభ్యులు కనకరాజు సూరి, చేగొండి సూర్య ప్రకాష్, పితాని బాలకృష్ణ, కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు, వివిధ నియోజకవర్గాల ఇంఛార్జులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.