ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు షురూ
17 పార్లమెంట్ స్థానాలకు 309 దరఖాస్తులు
గెలుపు గుర్రాల ఎంపిక కోసం నేడు పీఈసీ కీలక సమావేశం
హైదరాబాద్ : తెలంగాణలో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ మంగళవారం సమావేశం కానుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు 309 మంది టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా మహబూబాబాద్ నుంచి 47, వరంగల్ నుంచి 40 దరఖాస్తులు వచ్చాయి. అతి తక్కువగా మహబూబ్‌నగర్ నుంచి 4, జహీరాబాద్ నుంచి 6, మెదక్ నుంచి 10 అర్జీలు వచ్చినట్లు హస్తం పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం, గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు టికెట్ల కోసం 309 మంది నాయకులు అర్జీ పెట్టుకున్నారు. ఇందులో పార్టీ నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన అధికారులు, కళాకారులు కూడా ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. కొంతమంది అధికారులుగా కొనసాగుతూనే, లోక్‌సభ టికెట్ల కోసం అర్జీ చేసుకోగా మరికొందరు పదవీ విరమణ పొందిన అధికారులు కూడా దరఖాస్తు చేసుకున్నారు.
17 నియోజకవర్గాలకు అందిన అర్జీలను పరిశీలించినట్లయితే సగటున ఒక్కో నియోజకవర్గానికి 18 మందికి పైగా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అందులో ప్రధానంగా అత్యధికంగా ఎస్టీ రిజర్వ్ స్థానమైన మహబూబాబాద్ నుంచి 47 మంది దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ నుంచి 40 మంది, పెద్దపల్లి నుంచి 29 మంది, భువనగిరి నుంచి 28 మంది ఉన్నారు. అదే విధంగా మహబూబ్‌నగర్‌లో అతి తక్కువ అర్జీలు వచ్చాయి. కేవలం నలుగురు మాత్రమే రేస్‌లో ఉన్నారు. జహీరాబాద్ నుంచి ఆరుగురు దరఖాస్తు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా : ప్రధానమైన నాయకుల్లో సికింద్రాబాద్ నుంచి కోదండరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాలస్వామిలు పోటీలో ఉన్నారు. నల్గొండ నుంచి పటేల్ రమేశ్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, సర్వోత్తమరెడ్డిలు టికెట్లు ఆశిస్తున్నారు. భువనగిరి నుంచి చామల కిరణ్‌రెడ్డి, బండ్రు శోభారాణి, డాక్టర్ సూర్యపవన్ రెడ్డిలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి, మందా జగన్నాథం, చారకొండ వెంకటేశ్, సంపత్‌కుమార్ టికెట్ ఆశిస్తున్నారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, ఏ చంద్రశేఖర్, పెరికి శ్యామ్ రేస్‌లో ఉన్నారు. మెదక్ నుంచి ఎం.భవానీ రెడ్డి, బండారు శ్రీకాంత్, చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీ పడుతుండగా, చేవెళ్ల నుంచి భీమ్ భరత్, చిగురింత పారిజాత నరసింహారెడ్డి, మల్రెడ్డి రామిరెడ్డి, కిచ్చనగారి లక్ష్మారెడ్డిలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి నుంచి సినీ నిర్మాత బండ్ల గణేశ్, హరివర్ధన్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కర్ టికెట్ ఆశిస్తున్నారు. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఇరవత్రి అనిల్ కుమార్, కరీంనగర్ నుంచి ప్రవీణ్‌కుమార్ రెడ్డి, ఆకారపు భాస్కర్‌రెడ్డి, కటకం మృత్యుంజయం, రుద్ర సంతోశ్లు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. వరంగల్ నుంచి సిరిసిల్ల రాజయ్య, ఖమ్మం స్థానానికి నందిని భట్టి, రేణుకా చౌదరి, పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు రేస్‌లో ఉన్నారు. మహబూబ్‌నగర్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి, సీతాదయాకర్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి నరేశ్‌యాదవ్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, సీతారాం నాయక్ ఉన్నారు.
తరలివచ్చిన ఆశావహులు…300 దాటిన దరఖాస్తులు : పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారీ ఎత్తున 309 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అర్జీలకు సంబంధించి నియోజకవర్గం వారీగా గాంధీ భవన్ వర్గాలు జాబితాను సిద్ధం చేస్తున్నాయి. మంగళవారం గాంధీ భవన్లో జరగనున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీలో ఈ ఆశావహుల జాబితాపై చర్చించనున్నారు. నియోజకవర్గాల వారీగా ఇద్దరు లేక ముగ్గురు ప్రధానమైన నాయకులను పరిశీలించి అర్హులైన వారిని పీఈసీ ఎంపిక చేస్తుంది. పార్టీ ఎన్నికల కార్యాచరణపై కూడా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చర్చించే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ హరీశ్ చౌదరీ, సభ్యులు జిగ్నేశ్ మేవానీ, విశ్వజిత్ కధమ్, ఏఐసీసీ ఇంఛార్జ్ కార్యదర్శులు, పీఈసీ కమిటీ సభ్యులు పాల్గొననున్నారు.