హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పదేళ్ల పాలనలో పేదల సొంతింటి కల నేరవేరలేదని రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ఓట్ ఆన్ ఆకౌట్ బడ్జెట్లో అర్హులైనవారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్ స్కీమ్ తీసుకువచ్చి బస్తీలు అద్దె ఇళ్ళలో ఉండేవారి సొంతింటి కలను నెరవేరుస్తామని ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించడం ఆశ్చర్యకరంగా ఉంది. ఐదు సంవత్సరాల్లో దేశంలోని పేదలందరికీ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని భారతీయ జనతా పార్టీ 2014, 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిందని, పదేళ్లు గడిచినా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేదని ఇప్పుడు లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఐదేళ్ళల్లో రెండు లక్షల ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించడం ఎన్నికల లబ్ధికోసమే తప్ప పేదవారికి న్యాయం చేయాలన్న ఆలోచన బిజెపి ప్రభుత్వానికి ఏమాత్రం లేదని విమర్శించారు. సామాన్యుడి వేదనను మోదీ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని దుయ్యబట్టారు.