ములుగు : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన మిలటరీ చీఫ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్నను ఆ పార్టీ నియమించినట్లు తెలిసింది.ఇటీవలే ఆయన కేంద్ర కమిటీ సభ్యుల సమక్షంలో పూర్తి బాధ్యతలు స్వీకరించారు. మావోయిస్టు పార్టీ మళ్లీ తన ఉనికిని చాటు కోవడంతో పాటు తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఛత్తీస్ ఘఢ్ దండకారణ్యం కేంద్రంగా మావోయిస్టులు తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ అప్పుడప్పుడు అలజడులు సృష్టిస్తూ వస్తున్నారు. అయితే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గా వ్యవహరించిన యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రంలో కోవిడ్ బారినపడి 21 జూన్ 2021లో మృతి చెందిన విషయం విదితమే. దీంతో అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆ పార్టీ కట్టుదిట్టమైన వ్యూహా లు రచించింది.
ఈ స్థానాన్ని దక్కించు కునేందుకు మావోయిస్టు నేత ఆజాద్ సైతం తన వంతు ప్రయత్నాలు చేయగా చివరికి మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్య దర్శిగా మిలటరీ చీఫ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్నను నియమించింది. ఇటీవల మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఏఓబీ రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేశ్, ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సాయన్న కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న పీఎల్బీఏ బెటాలియన్ కమాండర్ మడివి హిడ్మా అలియాస్ హిద్మాతోపాటు మరికొందరు కీలక నేతలతో జరిగిన సమావేశంలో బడే చొక్కారావుని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు.