మేడారం జాతరలో వైద్య, ఆరోగ్య పరంగా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆయుష్, ఫుడ్ సేఫ్టీ శాఖ ఉన్నతాధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై ఆరోగ్య పరిరక్షణ పై హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లోని తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల నుండే వివిధ వారాలలో యాత్రికులు లక్షలాది గా వస్తున్న నేపథ్యంలో ఇప్పటినుండే ప్రధాన ప్రాంతాలలో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మందులు, పరీక్ష పరికరాలు, నోటీసు బోర్డులు తదితర ఏర్పాట్లను చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. వచ్చేనెల 15వ తేదీ నుండి ప్రధాన జాతర తేదీలైన ఫిబ్రవరి 21 నుండి 24 వరకు పూర్తిస్థాయిలో 3 షిఫ్ట్ లలో మెడికల్ క్యాంపులను, సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు టీములుగా పనిచేస్తూ చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా జడ్ చొంగ్తు మాట్లాడుతూ పలు ప్రాంతాలలో 90 వరకు వివిధ రకాల మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు . ప్రధాన జాతర సందర్భాలలో 3 షిఫ్టులుగా నిర్వహిస్తున్నామన్నారు. మాస్కులను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమీక్ష లో వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్. వి. కణ్ణన్, ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి, ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ శివలీల, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, డిఎంఈ డాక్టర్ త్రివేణి, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్, కమిషనర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.