అంధుల కోసం ప్రత్యేక బ్రెయిలీ లిపి కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ సేవలు చిరస్మరణీయమన్నారు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం. లూయిస్ బ్రెయిలీ 215 జయంతి సందర్భంగా Visually Challenged Employees Association ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని IMA బిల్డింగ్ లోని రిథమ్ కన్వెన్షన్ హాల్లో ఉద్యోగులు ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరై లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరించారు.
బ్రెయిలీ కంటి చూపును కోల్పోయినప్పటికీ సమాజంలోని అంధుల కోసం 200 ఎండ్ల కింద ప్రత్యేక లిపి ని రూపొందించిన డా. లూయిస్ బ్రెయిలీ చిరస్మణీయుడు అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ అంధ ఉద్యోగులను సన్మానించారు. అంధుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. అంధులతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అంధులు మనోధైర్యంతో ముందుకు సాగాలనీ పిలుపునిచ్చారు. అంధులు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని బుర్రా వెంకటేశం వెల్లడించారు. అంధుల పట్ల గౌరవాన్ని చూపాలన్నారు. వారు అందిస్తున్న సేవలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో, ప్రముఖ సామాజిక వేత్త ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఆర్టీసీ చైర్మన్ ఈడుపుగంటి లోకేంద్రనాథ్, ప్రముఖ రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి, వీరయ్య, రియాజ్, అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి షరీఫ్, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, అంధ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.