రాష్ట్ర భాజపా ముఖ్యనేతలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిశానిర్దేశం
చేశారు. ఖమ్మంలో ‘రైతు గోస – భాజపా భరోసా’ బహిరంగ సభ తర్వాత.. సభా వేదిక వద్ద
రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ సభ్యులతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ
సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ చుగ్, ఎన్నికల ఇంఛార్జి ప్రకాశ్
జావడేకర్తోపాటు దాదాపు 20 మంది ముఖ్యనేతలు పాల్గొన్నారు. అరగంటపాటు కోర్
కమిటీ సమావేశం జరిగింది.
ఎన్నికల సన్నద్ధతపై కీలక సందేశం : రాబోయే ఎన్నికల సన్నద్ధతపై ముఖ్య నేతలకు
అమిత్ షా కీలక సందేశం ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న
వేళ మరింత దూకుడుగా ఎన్నికల కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ
వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని
స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో భారాసను ఓడించేలా
ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. రాష్ట్రంలో భారాసకు ప్రత్యామ్నాయం
భాజపా మాత్రమే అన్న నినాదం ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని నేతలకు
గుర్తుచేశారు.
ఎవరితోనూ పొత్తులు ఉండవు : రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తులు ఉండబోవని ఈ సందర్భంగా
అమిత్ షా మరోసారి స్పష్టం చేసినట్లు తెలిసింది. తమిళనాడులో డీఎంకే, కేరళలో
కమ్యూనిస్టులతో దూరం ఉన్నట్లే.. తెలంగాణలో భారాసతో బీజేపీకి ఎలాంటి సంబంధాలు
లేవని స్పష్టం చేసినట్లు సమాచారం. రాష్ట్ర బీజేపీ నేతలకు పార్టీ కేంద్ర
నాయకత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో
పార్టీ ప్రస్తుత పరిస్థితి, బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల
కార్యాచరణపై ముఖ్య నాయకుల అభిప్రాయాలను అమిత్ షా తీసుకున్నట్లు సమాచారం.