ఢిల్లీ వేదికగా అస్త్రశస్త్రాలు రెడీ
ఇక అస్త్రాలు ప్రయోగించడమే ఆలస్యం
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి
అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. కేసీఆర్‌ను గద్దె
దించి తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజా క్షేత్రంలోకి వెళ్లి అధికారంలోకి రావాలని
కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తోంది. ఈ క్రమంలో ఏ చిన్నపాటి
అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా కాంగ్రెస్ నేతలు మార్చుకుంటున్నారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించిన తర్వాత ఒక్కసారిగా
తెలంగాణలో పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే కాంగ్రెస్‌దే
గెలుపు అన్నట్లుగా కొన్ని సర్వేలు కూడా తేల్చడంతో ఇక పార్టీ శ్రేణుల్లో ఎనలేని
జోష్ వచ్చింది. దీనికితోడు ఢిల్లీ వేదికగా అస్త్రశస్త్రాలు రెడీ అవుతున్నాయి.
సెంటిమెంట్‌తో పాటు ఆకర్షణీయ మేనిఫెస్టోతో తెలంగాణ ప్రజలను ఆకర్షించాలని
కాంగ్రెస్ నిర్ణయించింది. అధికార బీఆర్ఎస్పై కాంగ్రెస్ఎలాంటి అస్త్రాలు
ప్రయోగించబోతోంది.? సోనియాగాంధీ తెలంగాణకు ఏమేం వరాలు కురిపించబోతున్నారనే
విషయాలు తెలుసుకుందాం.
తెలంగాణ ఇచ్చిన పార్టీ అని కాంగ్రెస్‌కు పేరుందేగానీ రెండుసార్లు ఎన్నికలు
జరిగినా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీనికి తోడు ఆ ఎన్నికల్లో గెలిచిన కొందరు
ఎమ్మెల్యేలూ అధికార పార్టీలోకి దూకేయడం, దీనికి తోడు స్థానిక సంస్థల
ఎన్నికల్లోనూ ఎదురు దెబ్బలు తగలడంతో పార్టీకి గడ్డుకాలమే అన్నట్లుగా
పరిస్థితులు నెలకొన్నాయి కానీ కర్ణాటకలో కాంగ్రెస్ ఊహించని రీతిలో సీట్లు
దక్కించుకుని విజయకేతనం ఎగరేయడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. మునుపెన్నడూ
లేని జోష్ వచ్చింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అసెంబ్లీ ఎన్నిక ఎదుర్కొంటోన్న
కాంగ్రెస్‌కు ఈ గెలుపు జీవన్మరణ సమస్యేనని చెప్పుకోవచ్చు. పరిస్థితి పూర్తి
సానుకూలంగా మారిన ఇప్పుడూ గెలవకపోతే ఇక అంతే సంగతులని రాజకీయ విశ్లేషకులు
చెబుతున్నారు. అందుకే, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు సర్వశక్తులూ ఒడ్డాలని
కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే అటు అధికార బీఆర్ఎస్.. ఇటు బీజేపీ
నుంచి వలసల వర్షం, సర్వేలన్నీ కాంగ్రెస్‌కు ఓటేస్తుండటంతో ఇక హైకమాండ్ మరింత
జోరు పెంచింది. దీనికి తోడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , కీలక నేతలను
ఢిల్లీకి పిలిపించుకుని వ్యూహాలు రచించే పనిలో పడింది. ఇక ఎన్నికల కదనరంగంలోకి
దూకేశాం అన్నట్లుగా అటు ఢిల్లీ నేతలు ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు
ప్రజాక్షేత్రంలోకి వెళ్లిపోతున్నారు.
గడిచిన రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం కేసీఆర్‌కు పని చేస్తే
ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, సోనియా గాంధీ పిలుపుతో ఆ అస్త్రం
ఈసారి కాంగ్రెస్ పార్టీకి వర్కవుట్ అవుతుందని హైకమాండ్ అంచనా వేస్తోంది. ఈ
సభలో ఎన్నికల మేనిఫెస్టోనూ ప్రకటించి క్షేత్రస్థాయి నుంచీ ప్రచార కార్యక్రమాలు
నిర్వహిస్తామని, పార్టీ మేనిఫెస్టోను ప్రతి గడపకూ చేరుస్తామని పార్టీ వర్గాలు
చెబుతున్నాయి. ‘ప్లీజ్.. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి’
అని సోనియాతో సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు
భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో వరుస భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని
కూడా అధిష్టానం ప్లాన్ చేస్తోంది. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే ,
ప్రియాంక గాంధీ, సిద్దరామయ్యలను ఆహ్వానించి మూడు భారీ సభలను ఏర్పాటు చేయాలని
టీపీసీసీ వ్యూహరచన చేస్తోంది. అలాగే, బీసీ డిక్లరేషన్‌పైనా ప్రస్తుతం
కసరత్తు జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీసీలకు 34 సీట్లు కేటాయిద్దామని
రేవంత్ నిర్ణయించడం, బీసీలకు సీట్ల కోటాతోపాటు వారి అభ్యున్నతికి కాంగ్రెస్
పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలను, హామీలనూ వివరిస్తూ డిక్లరేషన్
రూపొందిస్తోంది. ఈ నెలాఖరున సూర్యాపేటలో బీసీ గర్జన సభను నిర్వహించి కర్ణాటక
సీఎం సిద్దరామయ్యను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఆ సభలో బీసీ డిక్లరేషన్
ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. సెప్టెంబరు 7 తర్వాత ప్రియాంక సభను ఏర్పాటు
చేసి అందులో మహిళా డిక్లరేషన్‌ను ప్రకటించనున్నట్లు చెబుతున్నారు. ఈ నాలుగు
సభలనూ నిర్వహించి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలోకి కాంగ్రెస్
పార్టీ దిగనుంది. సెప్టెంబరు 17న రాష్ట్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి
దానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానిస్తోంది. తెలంగాణ ఇచ్చిన
కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఆమెతో తెలంగాణ ప్రజలకు పిలుపు
ఇప్పించనుంది. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోనూ ఆ సభలోనే ప్రకటించనున్నట్లు
తెలుస్తోంది. దానిని ఆకర్షణీయంగా రూపుదిద్దనున్నట్లు పార్టీ వర్గాలు
చెబుతున్నాయి.