ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై ఆ పార్టీ దృష్టి
అన్నదాతలపై గులాబీ సమ్మోహనాస్త్రం
హైదరాబాద్ : తెలంగాణలో ఈసారి ముక్కోణపు పోరు జరగనుంది. హ్యాట్రిక్ విజయం
ఖాయమంటూ బీఆర్ఎస్, ఈసారి అధికారం హస్తగతమవుతుందంటూ కాంగ్రెస్, డబుల్ ఇంజన్
సర్కార్ ఏర్పడడం పక్కా అంటూ బీజేపీ ఇలా తెలంగాణలో ఎన్నికల వాతావరణం
వచ్చేసింది. అక్టోబర్ చివరినాటికల్లా నోటిఫికేషన్ వస్తుందనే అంచనాల నేపథ్యంలో
పార్టీలన్నీ అస్త్రశస్త్రాలకు పదునుపెడుతున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్,
కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోరు ఖాయమనే విశ్లేషణల నేపథ్యంలో ఆ మూడు
పార్టీలు సంసిద్ధమయ్యాయి.ఆయా పార్టీలు ఇప్పటికే ఎన్నికల కార్యచరణ మొదలుపెట్టగా
మరిన్ని వ్యూహాలు, ప్రణాళికలపై దృష్టిసారించాయి.
బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలు : కాంగ్రెస్ తమకు పోటీనే కాదంటూ తమను ఢీకొట్టే సత్తా
బీజేపీకి లేదని బీఆర్ఎస్ చెబుతున్నప్పటికీ అదంతా పైపైకేనని రాజకీయవర్గాలు
విశ్లేషిస్తున్నాయి. లోలోన ఆ పార్టీ కలవరపాటుకు గురవుతోందనే అభిప్రాయాలు
వ్యక్తమవుతున్నాయి. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ రూపంలో ముప్పుపొంచివుందని
గ్రహించిన గులాబీ దళపతి ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదని భావిస్తున్నారట.
ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారంలో ఉండడంతో ఈసారి ప్రజావ్యతిరేకత తప్పదనే
అంచనాలు బీఆర్ఎస్ శ్రేణులను భయపెడుతున్నాయి. తేడా పడితే అధికారం
చేజారిపోతుందనే భయం ఆ పార్టీని వెంటాడుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అందుకే వీలైనన్ని తాయిలాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై ఆ పార్టీ దృష్టి
పెట్టింది. ఉన్నపళంగా ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, రుణమాఫీ, ఇండ్ల పంపిణీతోపాటు
ఈమధ్య చాలా కార్యక్రమాలు ఈ కోవ కిందికే వస్తాయి. సిట్టింగుల్లో పలువురికి
సీట్లు దక్కడం కష్టమేననే విశ్లేషణలు ఆ పార్టీ శ్రేణుల కలవరానికి అద్దం
పడుతోందనే విశ్లేషణలున్నాయి. మరోవైపు అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే పలుమార్లు
సర్వేలు నిర్వహించగా వడపోతలపై గులాబీ బాస్ కేసీఆర్ దృష్టి పెట్టారని
తెలుస్తోంది. అసంతృప్తులు పార్టీని వీడే అవకాశం ఉండడంతో ఆచితూచి వ్యవహరించేలా
పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితా ఖరారు
చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
తెలంగాణలో మళ్లీ బీఆరెస్సేనా? : ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తరువాత రెండు
సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోనూ కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ (అప్పుడు
టీఆర్ఎస్) విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గత తొమ్మిదేళ్లుగా
ఎకఛత్రాధిపత్యంగా కొనసాగారు. మరో సారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్
సాధించాలన్న పట్టుదలతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. అయితే బీఆర్ఎస్ సర్కార్
పై తీవ్ర మైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమౌతోందన్న పరిశీలకుల విశ్లేషణ. పార్టీలో
వెల్లువెత్తుతున్న అసంతృప్తి, అదే సమయంలో కాంగ్రెస్ గట్టిగా పుంజుకోవడం..ఇక
అధికారమే తరువాయి అన్నట్లుగా ఆ పార్టీలో గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఐక్యత.
ఇవన్నీ వెరసి బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందా అన్న అనుమానాలు పరిశీలకుల నుంచే
కాకుండా బీఆర్ఎస్ శ్రేణుల నుంచే వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో తాజాగా
వెలువడిన ఓ సర్వే బీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ అది
ప్రభుత్వాన్నికూలదోసే స్థాయిలో లేదని పేర్కొంది. రాష్ట్రంలో కాంగ్రెస్
బలోపేతమైనప్పటికీ అది బీజేపీ స్థాయిని గణనీయంగా తగ్గించగలిగిందే కానీ,
బీఆర్ఎస్ ను అధిగమించే స్థాయికి చేరుకోలేకపోయిందని సర్వే పేర్కొంది.
తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ మరో సారి అధికారం
చేపట్టడం ఖాయమని టైమ్స్ నౌ వెల్లడించింది. అధికార బీఆరెస్స్ కు 38.4 శాతం
మంది ప్రజల మద్దతు ఉందని, ఆ తరువాత కాంగ్రెస్ కు 29.9 శాతం, బీజేపీకి 24.3
శాతం,ఇతరులకు 7.4 శాతం ప్రజా మద్దతు ఉందని టైమ్స్ నౌ సర్వే పేర్కొంది. అంటే
రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా తెలంగాణలో మెజార్టీ ప్రజలు బీఆరెస్స్ కు
మద్దతుగా నిలుస్తారని సర్వే వెల్లడించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హోరా
హోరీ పోరు తప్పదన్న అంచనాల నేపథ్యంలో వెలువడిన టైమ్స్ నౌ సర్వే కాంగ్రెస్
తెలంగాణలో బలంగా పుంజుకుందనీ, అయితే అధికారం చేజిక్కించుకునేందుకు ఆ బలం
సరిపోదనీ పేర్కొంది. అయితే రానున్న రోజులలో ప్రజా వ్యతిరేకత మరింత పెరిగే
అవకాశాలు కనిపిస్తున్నాయనీ, ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక, అసమ్మతి, అసంతృప్తి
వంటికి ఈ సారి కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం చేకూర్చే
అవకాశాలున్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అన్నదాతలపై గులాబీ అస్త్రం : బ్రహ్మాస్త్రాన్ని మించిన సమ్మోహక అస్త్రాన్ని
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందుగా ప్రయోగించారు. తెలంగాణ
రాష్ట్రంలో తొమ్మిది లక్షల పైచిలుకు అన్నదాతల కుటుంబాలకు లబ్ధి చేకూరేలాగా
లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
ఆచరణలోకి కూడా తెచ్చేశారు. 5800 కోట్ల రూపాయల నిధులను ఇందుకు విడుదల చేశారు.
తమది రైతుబంధు ప్రభుత్వం అని పదే పదే చాటుకుంటున్న చంద్రశేఖర రావు ప్రభుత్వం
ఎన్నికల ముంగిట్లో వారిని తమ పార్టీ పట్ల మరింత ఘనంగా ఆకర్షించేలాగా, ఆ
విషయాన్ని మరొకసారి నిరూపించుకుంది. నాలుగేళ్లుగా పట్టించుకోని రుణమాఫీ
ఇప్పుడే ఎందుకు తెరమీదకు వచ్చిందని విపక్ష పార్టీల నాయకులు ఆడిపోసుకోవచ్చు, ఈ
నాలుగేళ్లలో అయిన వడ్డీని కూడా ప్రభుత్వమే చెల్లించాలని సరికొత్త డిమాండ్లను
వినిపించవచ్చు గాక, కానీ ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల మేర రైతులకు జరిగిన
లబ్ది ముందు వారు చేస్తున్న విమర్శలన్నీ దూది పింజెల్లాగా ఎగిరిపోతాయని చెప్పక
తప్పదు.అలాగే అన్ని సామాజిక వర్గాలను కూడా ఆకర్షించే వరాలను ఎన్నికలకు
ముందుగానే కేసీఆర్ కార్యరూపంలోకి తేవడానికి వ్యూహరచనతో ఉన్నట్లు సమాచారం.