ఈ–వేస్ట్ రంగంలో దేశంలో తొలిసారిగా వినూత్న కార్యాచరణ
హైదరాబాద్ : ఎలక్ట్రానిక్ వేస్ట్ నిర్వహణ, రీసైక్లింగ్‌లో దేశంలో తొలిసారిగా
మిషన్ ఈ–వేస్ట్ పేరుతో వినూత్న కార్యక్రమానికి మల్టీ బ్రాండ్ మొబైల్స్
రిటైల్ చైన్ సెలెక్ట్ మొబైల్స్ శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల
శాఖ మంత్రి కె.తారక రామారావు, సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై.గురు చేతుల
మీదుగా మిషన్ ఈ–వేస్ట్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. ఆరోగ్యం, పర్యావరణంపై
ఈ–వేస్ట్ ప్రభావానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటిస్తూ బాధ్యతాయుత పరిష్కారంతో
సెలెక్ట్ మొబైల్స్ ఒక అడుగు ముందుకేసింది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న
ఎలక్ట్రానిక్స్ వినియోగం యుగంలో పర్యావరణం, ఆరోగ్యంపై ఈ–వేస్ట్ ప్రభావం చాలా
తీవ్రంగా ఉంది. సరైన రీతిలో నిర్వహించని ఈ–వేస్ట్ గాలి, నీరు, మట్టిని
కలుషితం చేస్తున్నాయి. ఇది చర్మ వ్యాధుల నుంచి డీఎన్ఏ ఉత్పరివర్తనాల వరకు
అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. ఇందుకు పరిష్కారంగా మిషన్ ఈ–వేస్ట్‌కు
సెలెక్ట్ మొబైల్స్ శ్రీకారం చుట్టింది. పరిశుభ్ర వాతావరణాన్ని, జీవన
ప్రమాణాలను పెంచే లక్ష్యంతో సేకరించిన ఈ–వేస్ట్‌ను నిబంధనలకు అనుగుణంగా
రీసైక్లింగ్ చేపడతారు. ఈ–వేస్ట్ నిర్వహణ కేవలం పర్యావరణ హితం కోసమే కాదు,
ప్రతి భారతీయ పౌరునికి అత్యవసరం అని సెలెక్ట్ మొబైల్స్ ఈ సందర్భంగా
తెలిపింది. భారత్‌లో ఈ-వేస్ట్ ఉత్పత్తిలో ఏటా 20-25% పెరుగుదల ఉందని గణాంకాలు
వెల్లడిస్తున్నాయి. 2020లో 10.45 లక్షల మెట్రిక్ టన్నులు ఈ-వేస్ట్ నమోదైంది.
ఈ ఏడాది 18.3 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. 2025 నాటికి 25.4 లక్షల
మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని అంచనా.
సమస్య తీవ్రత ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఎక్కువగా
ఉంది. ఆశ్చర్యకర విషయం ఏమంటే దాదాపు 95% ఈ-వేస్ట్ మురికివాడలలో
పేరుకుపోతున్నాయి. ఫలితంగా భయంకరమైన పర్యావరణ, ఆరోగ్య సమస్యలు
ఉత్పన్నమవుతున్నాయి. పనికిరాని మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వ్యక్తిగత
ఎలక్ట్రానిక్ పరికరాలు, మౌస్, కీబోర్డ్‌ల వంటి పెరిఫెరల్స్తో సహా అనేక రకాల
ఎలక్ట్రానిక్ పరికరాలను ఈ-వేస్ట్‌గా పరిగణిస్తారు. సరికాని రీతిలో ఈ పరికరాలను
పారవేయడం పర్యావరణ విపత్తు, మానవ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. వీటితో నేల,
నీరు, గాలి కలుషితం అవుతోంది. పీల్చే కాలుష్యాల వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ
సమస్యలు తలెత్తుతాయి. ఈ-వేస్ట్‌లో కనిపించే భారీ లోహాలు నరాలు, జ్ఞానంపైన
ప్రభావం చూపిస్తాయి. ఈ-వేస్ట్‌లోని టాక్సిన్స్ గుండెను ప్రతికూలంగా ప్రభావితం
చేస్తాయి, అలాగే వివిధ వ్యాధులకు దారితీయవచ్చు. కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం
వల్ల అనారోగ్యాలు, అవయవాలు దెబ్బతినడం, క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుంది.
హార్మోన్లపై ప్రభావంతో పునరుత్పత్తి, అభివృద్ధి ప్రక్రియలకు అంతరాయం
కలిగిస్తుంది. పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులను సెలెక్ట్ రిటైల్
స్టోర్లకు తీసుకు వస్తే చాలు. కస్టమర్లు రూ.1,000 మొదలుకుని రూ.10,000 వరకు
డిస్కౌంట్ కూపన్ అందుకోవచ్చు. కూపన్ కాల పరిమితి ఆరు నెలల వరకు ఉంటుంది.
మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్ పీసీలు, టీవీలు, ఇతర
ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను డిపాజిట్ చేయడం ద్వారా వినియోగదార్లు డిస్కౌంట్
కూపన్ పొందవచ్చు. ప్రతి సెలెక్ట్ ఔట్లెట్లో ప్రత్యేకంగా ఈ–వేస్ట్
బిన్స్‌ను ఏర్పాటు చేస్తారు. అలాగే నివాస స్థలాలు, పాఠశాలలు, దేవాలయాలు, ఇతర
కీలక ప్రాంతాల్లోనూ ఈ–వేస్ట్ కియోస్క్‌లను అందుబాటులో ఉంచాలన్నది కంపెనీ
ప్రణాళిక. సెలెక్ట్ మొబైల్స్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో 150
విక్రయ శాలలు ఉన్నాయి.
ఉపయోగించని లేదా సరిగా పని చేయని ఎలక్ట్రానిక్ పరికరాలను సరైన రీతిలో
నిర్వహించకుండా వాటిని ఇళ్లలోనే అట్టిపెట్టుకుంటున్నారని తెలంగాణ ఐటీ,
పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఈ-వేస్ట్ పారవేయడం వల్ల
ఉత్పన్నమయ్యే సంభావ్య ఆరోగ్య ప్రమాదాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. మిషన్
ఈ-వేస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సెలెక్ట్ మొబైల్స్ చొరవను
ప్రశంసించారు. కంపెనీ అంకితభావాన్ని, పెరుగుతున్న ఈ-వేస్ట్ సంక్షోభాన్ని
పరిష్కరించడంలో వారి ప్రయత్నాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఐటీ కారిడార్లు,
మాల్స్, బస్టాప్‌లు, విమానాశ్రయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు,
ఆసుపత్రులు వంటి ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండే కీలక ప్రదేశాల్లో
వ్యూహాత్మకంగా ఈ-వేస్ట్ డబ్బాలను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని ఆయన ఈ
సందర్భంగా కంపెనీని కోరారు. వ్యర్థాల నిర్వహణ పెద్ద సవాల్‌గా మారిందని గుర్తు
చేశారు. మానవాళికి అతిపెద్ద సవాల్‌గా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు.
శాస్త్రీయంగా ఈ-వేస్ట్‌ను నిర్వహిస్తేనే మనుగడ ఉంటుందని అన్నారు. దేశంలో ఏటా
20 లక్షల టన్నుల ఈ-వేస్ట్ పోగవుతోందని మంత్రి వెల్లడించారు. మొబైల్స్
రిటైల్ పరిశ్రమలో రెండున్నర దశాబ్దాల అనుభవం వై.గురు ప్రత్యేకత. ‘దశాబ్దాలుగా
తయారీ, పంపిణీ నుంచి సొంతంగా ఓఈఎం బ్రాండ్స్, రిటైల్ విభాగాలను స్థాపించడం
వరకు ఈ పరిశ్రమలోని ప్రతి అంశంలో మేము నిమగ్నమయ్యాం. ఎన్నో మార్గాల్లో పరిశ్రమ
మమ్మల్ని సుసంపన్నం చేసింది. మిషన్ ఈ–వేస్ట్ ఒక చొరవ కంటే ఎక్కువ. మాకు
పునాదిగా ఉన్న పరిశ్రమకు తిరిగి ఇవ్వడానికి ఇది ఒక మార్గం అని భావిస్తున్నాం.
మేము ఆరాధించే, ప్రోత్సహించే సాంకేతిక ఆవిష్కరణలు మన పర్యావరణానికి నష్టం
కలిగించవని మా నమ్మకం కూడా’ అని వై.గురు ఈ సందర్భంగా అన్నారు. ఉత్పత్తి,
విక్రయాలకు అతీతంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ బాధ్యతను కూడా కలిగి ఉందని
సెలెక్ట్ ఈడీ మురళి కృష్ణ రేతినేని తెలిపారు. ‘ఎలక్ట్రానిక్ ఉపకరణాలు
పర్యావరణానికి హాని కలిగించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. సెలెక్ట్ మొబైల్స్
ప్రారంభించిన మిషన్ ఈ–వేస్ట్ మొత్తం పరిశ్రమకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన
ధీమా వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా ఈ-వేస్ట్ నిర్మూలన దిశగా సెలెక్ట్
మొబైల్స్ ఈ-వేస్ట్ రంగంలోని మూడు ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ఈ
వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా సేకరించిన ఈ-వేస్ట్‌ను అత్యంత జాగ్రత్తగా,
బాధ్యతతో నిర్వహిస్తారు. తద్వారా పర్యావరణంపై దాని ప్రతికూల ప్రభావాన్ని
తగ్గిస్తుంది.