భజ్రంగ్దళ్ కార్యకర్తల అరెస్ట్
హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద భజరంగ్‌దళ్
కార్యకర్తలు తలపెట్టిన ‘హనుమాన్ చాలీసా పఠనం’ కార్యక్రమాలను పోలీసులు భగ్నం
చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు.. భజ్రంగ్దళ్ కార్యకర్తలను అడ్డుకోవటంతో
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భజరంగ్‌దళ్ కార్యకర్తలకు పోటీగా కాంగ్రెస్
నేతలు ఆందోళనలు చేపట్టడంతో గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వస్తే భజరంగ్‌దళ్‌ను
నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటన చెయ్యడంతో.. భజరంగ్‌దళ్ కార్యకర్తలు
నేడు ఆందోళనకు దిగారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ కార్యాలయాల ఎదుట
హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని భజరంగ్‌దళ్ పిలుపునిచ్చింది. దీంతో
హైదరాబాద్‌లోని గాంధీభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ కాంగ్రెస్
కార్యాలయాల వద్ద హనుమాన్ చాలీసా చదవాలని నిర్ణయించిన భజరంగ్‌దళ్ నేతలు ఆందోళనకు
దిగారు. ముందుగానే అప్రమత్తమైన పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
గాంధీ భవన్ రెండో గేట్ వద్ద బారికేడ్లు, రోప్ పార్టీలతో బందోబస్తు ఏర్పాటు
చేశారు. పరిసర ప్రాంతాల్లో కూడా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. అయినా విడతల
వారీగా గాంధీభవన్‌కు భజరంగ్‌దళ్ కార్యకర్తలు వస్తుండటంతో పోలీసులు అడ్డుకుని
అదుపులోకి తీసుకుంటున్నారు. మోండా మార్కెట్ కార్పొరేటర్ దీపికా, మరికొందరు
గాంధీభవన్ వద్ద ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
వారిని గోషామహల్ తరలించేలోపు మరికొందరు భజరంగ్‌దళ్ కార్యకర్తలు వచ్చారు.రెండో
గేట్ వద్ద రోడ్‌పై బైఠాయించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అదేవిధంగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
తీవ్ర వాగ్వాదం, తోపులాటల మధ్య వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని గోషామహల్
తరలించారు.