వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు
కొన్నిరోజుల వ్యవధిలో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్
కోర్టులో కస్టడీ పిటిషన్ వేసిన సీబీఐ
కస్టడీకి అనుమతి ఇచ్చిన నాంపల్లి సీబీఐ న్యాయస్థానం
ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న భాస్కర్ రెడ్డి, ఉదయ్
హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇటీవల కొన్నిరోజుల
వ్యవధిలో సీబీఐ వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను అరెస్ట్ చేయడం
తెలిసిందే. తాజాగా, నాంపల్లి సీబీఐ కోర్టు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్
రెడ్డిలకు 6 రోజుల కస్టడీ విధించింది. ఆ మేరకు వారిద్దరి కస్టడీకి సీబీఐకి
అనుమతి ఇచ్చింది. వివేకా హత్యకు భాస్కర్ రెడ్డి నెల రోజుల ముందు కుట్ర
పన్నారని, అందుకోసం రూ.40 కోట్లను సిద్ధం చేసుకున్నారని, అందులో నాలుగైదు
కోట్ల రూపాయలు చేతులు మారాయని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. భాస్కర్
రెడ్డి సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి అని, దర్యాప్తును ప్రభావితం చేసే
అవకాశాలున్నాయని, పైగా అతడు విచారణలో సరైన సమాధానాలు ఇవ్వడంలేదని సీబీఐ
అధికారులు వివరించారు. అందుకే అతడిని అరెస్ట్ చేశామని, కస్టడీలోకి తీసుకుని
విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కోర్టుకు తెలిపారు. కాగా
వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్
ఖైదీలుగా ఉన్నారు.