రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ
మెదక్ : వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం దాదాపు అరవై ఏండ్లుగా నిరంతరం
రాజీలేని పోరాటాలు చేయడం నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎపీయూడబ్ల్యూజేతో, నేడు
తెలంగాణలో టీయుడబ్ల్యుజెతోనే సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్
జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ స్పష్టం చేశారు.
సోమవారం మెదక్ జిల్లా రామయంపేటలో జరిగిన యూనియన్ జిల్లా కార్యవర్గ
సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
జర్నలిస్టుల్లో ఐక్యతను దెబ్బతీసేందుకే పథకం ప్రకారం జర్నలిస్టు సంఘాల పేరుతో
కొందరు వ్యక్తులు కొన్ని దుకాణాలు తెరిచారని విరాహత్ విమర్శించారు. ఎవరెన్ని
జిమ్మిక్కులు చేసినా వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమానికి మారుపేరుగా
టీయుడబ్ల్యుజె జర్నలిస్టుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిందన్నారు.
జర్నలిస్టుల కనీస సౌకర్యాల సాధన కోసం యూనియన్ పోరాడుతూనే ఉంటుందన్నారు.
రాష్ట్రంలో వేలాది మంది జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమ సంఘం,
దేశంలోనే అతిపెద్ద సంఘంగా గుర్తింపు పొందడం గర్వంగా ఉందన్నారు. ఉమ్మడి
రాష్ట్రంలో రాజ్యం నిర్బంధకాండను, ఉక్కుపాదాన్ని ఎదుర్కొంటూనే జర్నలిస్టుల
సంక్షేమం కోసం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం జిల్లాలో లెక్కలేనన్ని సామాజిక
పోరాటాలు నిర్వహించి ఆదర్శ జిల్లా శాఖగా పేరుగడించిన మెదక్ జిల్లా శాఖ అదే
స్ఫూర్తితో పనిచేయాలని విరాహత్ సూచించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన
జిల్లా శాఖ అధ్యక్షుడు శంకర్ దయాల్ చారీ మాట్లాడుతూ నాటి యూనియన్ నాయకత్వం
అందించిన సామాజిక చైతన్యం, స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నట్లు చెప్పారు.
ఇప్పటికే తమ జిల్లాలో జర్నలిస్టులకు ఇండ్లు, ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియ
దాదాపు 70శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. అర్హులైన జర్నలిస్టులందరికీ
అక్రెడిటేషన్ కార్డులను మంజూరీ చేయించామన్నారు. త్వరలోనే మెఫీ సంస్థ సహకారంతో
మెదక్ లేదా నర్సాపూర్ పట్టణాల్లో జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమాన్ని
నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేసారు. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ
సభ్యుడు డి.జి.శ్రీనివాస్ శర్మ, జిల్లా కార్యదర్శి సంతోష్, యూనియన్ సీనియర్
నాయకులు మిన్పూర్ శ్రీనివాస్, కంది శ్రీనివాస్ రెడ్డి, బుక్కా అశోక్, నాగరాజు,
మోహన్ రాజు, భూమయ్య, సత్యనారాయణ, మల్లేశం, దేవరాజ్ తదితరులు మాట్లాడారు. పలు
అంశాలపై జిల్లా కార్యవర్గం చర్చించి పలు తీర్మానాలను ఆమోదించింది.