‘డిజిజ్ఞాన్’ ప్రాజెక్టుకు ఐటీ మంత్రి కేటీఆర్ రూ.8 లక్షల పెట్టుబడిని
అందించారు. వీహబ్‌లో అంకుర ప్రాజెక్టు ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలో
పాఠశాల విద్యార్థుల తొలి అంకుర ప్రాజెక్టు ఇదేనని తెలిపిన ఆయన అది విజయవంతం
కావాలని ఆకాక్షించారు.రాష్ట్రంలో ఇద్దరు పాఠశాల విద్యార్థులు అంకుర సంస్థ వ్యవస్థాపకులుగా
మారుతున్నారు. హైదరాబాద్ బోడుప్పల్‌లోని పల్లవి మోడల్ స్కూల్లో 9, 10వ
తరగతి చదివే నసీఫా అంజుమ్, శ్రీ మానసలు ఈ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు.
డిజిటల్ అక్షరాస్యత, ఉపాధి నైపుణ్య శిక్షణ, సైబర్ భద్రతపై వారు రూపొందించిన
‘డిజిజ్ఞాన్ ప్రాజెక్టు’ను మంత్రి కేటీఆర్‌కి అందించారు. ఆ ప్రాజెక్టును
రాష్ట్ర మహిళా పారిశ్రామిక వేత్తల కేంద్రం వీ-హబ్‌లో ఏర్పాటు చేయనున్నారు.
గత నెల 8న వీహబ్ ఐదో వార్షికోత్సవ వేదికపై విద్యార్థినులు మంత్రి కేటీఆర్‌కు
తమ ఆవిష్కరణ గురించి వివరించారు. మంత్రి వారిని అభినందించి ఆవిష్కరణ
ప్రాజెక్టును రూపొందించి అందిస్తే ఏర్పాటుకు సాయం అందిస్తామని తెలిపారు. ఈ
మేరకు విద్యార్థినిలిద్దరూ డిజిటల్ అక్షతాస్యత విస్తరణకు రూపొందించిన
డిజిజ్ఞాన్ ప్రాజెక్టు నివేదికతో ఐటీ మంత్రి కేటీఆర్‌ను నానక్‌రామ్‌గూడలోని
హెజీసీఎల్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆ విద్యార్థినులు..
తాము గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల విద్యార్థినులతో
మాట్లాడినప్పుడు వారిలో డిజిటల్ విద్యపై అవగాహన తక్కువగా ఉందని, దాన్ని
నేర్చుకునే సదుపాయాలు తక్కువగా ఉన్నాయని గుర్తించామని పేర్కొన్నారు.అదేవిధంగా
నేటి ఆధునిక కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై అధ్యయనం చేశామని, వీహబ్
నిర్వహించిన శిక్షణ తరగతులకు హాజరైనప్పుడు వీటిపై అంకుర ప్రాజెక్టు ఏర్పాటు
చేయాలనే ఆలోచన తమకు వచ్చిందని చెప్పారు. ఏదులాబాద్, కంచవానిసింగారం,
ప్రతాప్‌సింగారం, ముత్యాలగూడ గ్రామాల్లోని పాఠశాలల్లో వచ్చే 12 నెలల్లో 50
మందికి శిక్షణ ఇచ్చి, దానిని 25 గ్రామాలకు విస్తరిస్తామని, వేయి మందిని
తీర్చిదిద్దుతామని వారు పేర్కొన్నారు. తాము రూపొందించిన అంకుర ప్రాజెక్టుకు
రూ.10 లక్షల మేర సాయం కావాలని ఆ ఇద్దరు విద్యార్థినిలు అర్థించారు.