హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు అంక్షలు విధించారు.
హైదరాబాద్ మధ్య మండలంలోని ప్రధాన రహదారుల మీదుగా రాకపోకలు కొనసాగించే వాహనాలను
దారి మళ్లించనున్నారు. నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, మింట్ కంపౌండ్
దారులను పూర్తిగా మూసి వేయనున్నారు. ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్కు, ఎన్టీఆర్
గార్డెన్లో ఈ రోజు సందర్శకులకు అనుమతి లేదు. మధ్యాహ్నం 1గంట నుంచి రాత్రి 8
గంటల వరకు అంక్షలు అమల్లో ఉండనున్నాయి.హైదరాబాద్‌లో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దాదాపు లక్ష మందిని
సమీకరించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హుస్సేన్‌సాగర్ తీరాన జరిగే ఈ
కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం దృష్ట్యా ఇవాళ నగరవాసులకు
ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు పలు దారుల్లో వాహనాల రాకపోకలపై
అంక్షలు విధించారు. ఈరోజు మధ్యాహ్నం 1గంట నుంచి రాత్రి 8 గంటల వరకు అంక్షలు
అమల్లో ఉండనున్నాయి. నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్, లక్డీకపూల్, తెలుగుతల్లి
జంక్షన్ రహదారుల్లో ట్రాఫిక్ అంక్షలు ఉంటాయి. నెక్లెస్ రోడ్డు – ఎన్టీఆర్
మార్గ్ – తెలుగుతల్లి జంక్షన్ వైపు వాహనాలకు అనుమతి లేదు.
వాహనాల దారి మళ్లింపు ప్రాంతాలు..వాటి వివరాలు
1. పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోడ్డు, రోటరీ వైపు వెళ్లే
వాహనాలు షాదన్ కళాశాల మీదుగా వెళ్లాలని పోలీసులు తెలిపారు.
2. సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ వైపు
వెళ్లే వాహనాలు రాణిగంజ్ మీదుగా వెళ్లాలని వివరించారు.
3. లక్డీకపూల్ నుంచి ట్యాంక్‌బండ్, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు తెలుగుతల్లి
ఫ్లైఓవర్, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తామన్నారు.
4. ట్యాంక్ బండ్, బీఆర్కే భవన్, తెలుగుతల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్
వైపు వచ్చే వాహనాలు.. లక్డీకపూల్ మీదుగా వెళ్లాలని సూచించారు.
5. అఫ్జల్ గంజ్ నుంచి ట్యాంక్ బండ్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే ఆర్టీసీ
బస్సులు తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్ట మైసమ్మ, లోయర్ ట్యాంక్‌బండ్, డీబీఆర్
మిల్స్, కవాడీగూడ మీదుగా వెళ్లాలని పోలీసులు పేర్కొన్నారు.
పార్కింగ్ ప్రదేశాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చే
వాహనదారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పీపుల్స్ ప్లాజా, జలవిహార్, బేబీ
పాండ్, సంజీవయ్య పార్కు లోపలి వైపు, ఎన్టీఆర్ ఘాట్, మింట్ కంపౌండ్, ప్రసాద్
ఐమాక్స్, నూతన సచివాలయం వైపు వాహనాల పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు.
నేడు సందర్శకులకు అనుమతి నిరాకరణ
మింట్ కౌంపౌండ్, నెక్లెస్ రోటరీ మార్గాలను ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా
మూసేశారు. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్కులో రేపు
సందర్శకులకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఖైరతాబాద్, సైఫాబాద్, రవీంద్ర
భారతి, మింట్ కంపౌండ్, నల్లగుట్ట, లోయర్ ట్యాంక్ బండ్, లిబర్టీ, తెలుగు తల్లి
సిగ్నళ్ల వద్ద భారీ వాహనాల రద్దీ ఉండే అవకాశముందని.. ఆయా మార్గాల మీదుగా
వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.