స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్న కేటీఆర్
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఏపీలోని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను
బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ‘‘విశాఖ స్టీల్‌ప్లాంట్
ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలి. కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు
మానాలి. వర్కింగ్ క్యాపిటల్, నిధుల సమీకరణ పేరుతో ప్లాంట్‌ను ప్రైవేట్
కంపెనీలకు అప్పజెప్పాలని ప్రయత్నిస్తున్నారు’’ అని లేఖలో కేటీఆర్
పేర్కొన్నారు. కార్పొరేట్ మిత్రుల కోసం రూ.12.5 లక్షల కోట్లు మాఫీ చేశారని,
అదే ఔదార్యం విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఎందుకు లేదని ప్రశ్నించారు. వర్కింగ్
క్యాపిటల్ కోసం కేంద్రమే ఆర్థిక సాయం చేయాలని, విశాఖ ప్లాంట్ నుంచి స్టీల్
ఉత్పత్తులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విస్తరణ ప్రణాళికల్లో.. విశాఖ స్టీల్ ప్లాంట్
విలీనం విషయాన్ని పరిశీలించాలని కేటీఆర్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు
వెంటనే రూ.5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్
ప్రైవేటీకరణను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ప్రభుత్వ రంగ
సంస్థల అమ్మకాలకు వ్యతిరేకంగా చేసే పోరాటానికి కార్మికులు కలిసి రావాలని
పిలుపునిచ్చారు.
స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే
ఉందని కేటీఆర్ మండిపడ్డారు. దొడ్డిదారిన ప్రైవేటుకు కట్టబెట్టే కుతంత్రానికి
తెరలేపిందని వెల్లడించారు. వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ
పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు ఏకంగా
నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిగా
ప్రైవేటుపరం చేసే ముందు, దాన్ని నష్టాల పాలుచేసి, నష్టాలను సాకుగా చూపించి
లక్షల కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా ప్రైవేటు కార్పొరేట్ మిత్రులకు
అప్పజెప్పేందుకు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. అందులో భాగంగానే
స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన ప్రత్యేక ఐరన్ వోర్ గనులను కేటాయించకుండా కేంద్రం
మోకాలడ్డు పెట్టిందని తెలిపారు. దీంతో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ తన ఉత్పత్తి
ఖర్చులో 60 శాతం వరకు పూర్తిగా ముడిసరుకుపైనే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆందోళన
వ్యక్తంచేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలన్న చిత్తశుద్ది తమకు ఉందని
మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. కలిసి వచ్చే శక్తులు, ప్రజాసంఘాలు, పార్టీలతో
కలసి ప్రజలను మరింత చైతన్యవంతం చేస్తామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగు
ప్రజల హక్కు అని, దాన్ని కాపాడుకోవడం కోసం తెలుగు వారందరూ కలిసి రావడం అవసరమని
భావిస్తున్నామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మిక సంఘాలను
కలిసి వారికి సంఘీభావం తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు
తోట చంద్రశేఖర్‌కు కేటీఆర్ సూచించారు.