హైదరాబాద్ : మహారాష్ట్రకు చెందిన పలువురు రైతు సంఘాల నేతలు బీఆర్ఎస్ పార్టీలో
చేరారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కార్యక్రమం
జరిగింది. మహారాష్ట్ర రైతు సంఘం నాయకుడు శరద్ జోషి ప్రణీత్, ఇతర రైతులు సీఎం
కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. మహారాష్ట్ర రైతులకు
కేసీఆర్ సాదరంగా పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్
ప్రసంగించారు. ఒకప్పుడు తెలంగాణ రైతుల పరిస్థితి దారుణంగా ఉండేదని తెలిపారు.
ప్రతి రోజూ ఐదారుగురు రైతులు చనిపోయిన పరిస్థితులు చూశామని వెల్లడించారు.
వాళ్ల పరిస్థితి తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నానని పేర్కొన్నారు. ప్రత్యేక
రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమస్యలన్నీ తీరిపోయాయని కేసీఆర్ చెప్పారు. ధాన్యం
ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. హిమాలయాల్లో
కంటే ఉన్నతమైన సంకల్పం ఇక్కడ ఉందని, అందుకే ఎండాకాలంలోనూ ఇక్కడ నీళ్లు
ప్రవహిస్తున్నాయని అన్నారు. దేశంలో దేనికీ కొదవలేదని, కానీ ఎలాంటి వనరులు
లేకపోయినా సింగపూర్ అలా ఎందుకుంది? మనం ఇలా ఎందుకున్నాం? అని కేసీఆర్
ప్రశ్నించారు. సింగపూర్ లో కనీసం మట్టి కూడా లేదన్నారు. ధర్నా చేస్తున్న
రైతులను కేంద్రం ఉగ్రవాదులతో పోల్చిందని, రైతులు తమ సమస్యలపై చెక్కుచెదరకుండా
పోరాటం చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. చివరికి ప్రధాని రైతులకు క్షమాపణలు
చెప్పారని తెలిపారు. వాహనాల వేగం ప్రపంచంలో ఎలా ఉంది? భారత్ లో ఎలా ఉంది? అని
కేంద్రంపై ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే అంతర్జాతీయంగా మనం ముందుకు
ఎలా వెళతామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని బాగు చేసే శక్తి రైతులకు మాత్రమే
ఉందని ఉద్ఘాటించారు.