జయశంకర్ భూపాలపల్లి జిల్లా : రాష్ట్ర పోలీస్ అత్యుత్తమంగా శాంతి, భద్రతలు
కాపాడుతూ దేశంలోనే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర హోమ్ మంత్రి ఎం.డి. మహమూద్ అలీ
అన్నారు. శనివారం జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర
హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ స్థానిక ఎమ్మేల్యే వెంకటరమణారెడ్డి, డి.జి.పి.
అంజని కుమార్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి దాదాపు 10 కోట్లతో
నిర్మించిన 4 పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించారు. భూపాల్ పల్లి జిల్లాకు
విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీకి జిల్లా కలెక్టర్
ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం
స్వీకరించిన హోం శాఖ మంత్రి అనంతరం మొగుళపల్లి లో నూతన పోలీస్ స్టేషన్
భవనాన్ని ప్రారంభించారు. అనంతరం టేకుమట్లలో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలను
నేరుగా పలిమేల, కాళేశ్వరం పొలీస్ స్టేషన్లు వర్చువల్ గా ప్రారంభించిన మంత్రి
అక్కడ నిర్వహించిన సభలో పాల్గొన్నారు.
ప్రశాంత వాతావరణంలో అధిక పెట్టుబడులు వస్తాయని, రాష్ట్రం అభివృద్ధి
చెందుతుందని బలంగా విశ్వసించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.700 కోట్లు ఖర్చు చేసి
పోలీసులకు ఆధునిక పేట్రోలింగ్ వాహనాలు అందించారని, డయల్ 100 వ్యవస్థను
పటిష్టం చేశారని హోంమంత్రి పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని
ప్రవేశపెట్టి ప్రజలో విశ్వాసాన్ని పెంపొందించామని, నూతన పోలీస్ నియామకాలలో
మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి, ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా సిబ్బంది
అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని హోంమంత్రి తెలిపారు.
ఆధునిక నేరాలను అరికట్టేందుకు అవసరమైన పరిజ్ఞానం, వసతులు పోలీస్ శాఖకు
అందిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం
జరుగుతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్
సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. దేశ వ్యాప్తంగా వినియోగిస్తున్న సిసి
కేమేరాల్లో 64% మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి పటిష్ట నిఘా పెట్టామని తెలిపారు.
సీసీ కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేశామని అన్నారు. గతంలో
పోలీసుల పట్ల ఉన్న భయం స్థానంలో ప్రస్తుతం గౌరవం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ
రాష్ట్రంలో పకడ్బందీగా శాంతిభద్రతలు ఉన్న కారణంగా వేగంగా అభివృద్ధి
చెందుతుందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ అవసరాలు 3 రేట్లు
పెరిగినప్పటికీ నిరంతరాయంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని,
ఇంటింటికి త్రాగునీరు మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
మాత్రమేనని, రైతు సంక్షేమం కోసం రైతుబంధు రైతు బీమా వంటి పథకాలను
ప్రవేశపెట్టామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు
చేస్తున్నామని హోం మంత్రి తెలిపారు.