హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ అంశంపై
గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
దీక్షకు దిగారు. అయితే ఈ దీక్షకు అనుమతి లేదని తొలుత పోలీసులు తెలిపారు.
అయినప్పటికీ దీక్ష చేపట్టడంతో పోలీసులు, బండి సంజయ్ మధ్య కాసేపు చర్చలు
జరిగాయి. అనంతరం పోలీసులు కాస్త వెనక్కి తగ్గడంతో సంజయ్ దీక్ష కొనసాగించారు.
అనంతరం దీక్ష ముగించే సమయంలో టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్తామని సంజయ్
ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గన్‌పార్క్ నుంచి టీఎస్పీఎస్సీకి
బయలుదేరిన బీజేపీ నేతలను, బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త
వాతావరణం ఏర్పడింది. తొలుత బండి సంజయ్ పార్టీ కార్యాలయం నుంచి గన్‌పార్క్‌కు
పాదయాత్ర చేపట్టారు. సంజయ్‌తోపాటు పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
ఆయనకు మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి
వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. టీఎస్పీఎస్సీ
పేపర్ లీకేజీ వ్యవహారంపై త్వరగా విచారణ చేపట్టాలని ఆందోళనకు దిగారు. ఐటీ శాఖ
మంత్రి కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.