హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో రాజకీయ పార్టీలు పోటాపోటీగా
కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత దీక్షకు పోటీగా శుక్రవారం
హైదరాబాద్లో బీజేపీ మహిళా మోర్చా నేతలు దీక్ష చేయనున్నారు. తెలంగాణలో
రాజకీయం వేడెక్కింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు పోటాపోటీగా
కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. భారాస ఎమ్మెల్సీ కవిత దీక్షకు పోటీగా
హైదరాబాద్లో దీక్ష చేపట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. ఢిల్లీ లోని జంతర్
మంతర్ వద్ద మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపడుతుండగా ఆమెకు ధీటుగా
హైదరాబాద్లో బీజేపీ మహిళా మోర్చా నేతలు రాష్ట్రంలోని బెల్టు షాపులు, మహిళలపై
హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో బీజేపీ జాతీయ
ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు.
రాష్ట్రంలో మహిళలపై జరిగే అరాచకాలకు నిరసనగా చేపట్టే దీక్షలో మహిళా నేతలంతా
పాల్గొనాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు.
నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు
కొనసాగే దీక్ష ద్వారా తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు దేశమంతా తెలియజేయాలని
చెప్పారు. పార్టీ కార్యాలయంలో మహిళా మోర్చా నేతలతో సమావేశమైన బండి సంజయ్
తెలంగాణ మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. రాష్ట్రంలో మద్యం
బెల్టు షాపులతో మహిళలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. శుక్రవారం జరిగే
దీక్షలో డీకే ఆరుణ, విజయశాంతి పాల్గొంటారని వివరించారు.