హైదరాబాద్ : పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో దోషి రాకేశ్
రెడ్డికి నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది. పారిశ్రామికవేత్త చిగురుపాటి
జయరాం హత్య కేసులో నాంపల్లిలోని మొదటి అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్
న్యాయస్థానం గురువారం కీలక తీర్పు వెలువరించింది. దోషి రాకేశ్ రెడ్డికి జీవిత
ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. దాదాపు నాలుగేళ్లపాటు కేసు
విచారణ జరిపిన న్యాయస్థానం ఇటీవల రాకేశ్‌రెడ్డిని దోషిగా తేల్చిన విషయం
తెలిసిందే. హత్య కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు 23 పేజీల
ఛార్జిషీట్ దాఖలు చేసి అందులో 12 మందిని నిందితులుగా చేర్చారు. కేసులో 73
మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం రాకేశ్‌రెడ్డిని దోషిగా
నిర్ధారించింది. మరో 11మందిని నిర్దోషులుగా తేల్చింది. ఏసీపీ మల్లారెడ్డితో
పాటు మరో ఇద్దరు సీఐలను నిర్దోషులుగా ప్రకటించింది. హనీట్రాప్‌తో జయరాం హత్యకు
కుట్రపన్నిన రాకేశ్‌రెడ్డి జయరాంను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు పక్కా
ఆధారాలతో ఛార్జిషీట్ దాఖలు చేయడంతో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు
విధించింది.
నాలుగేళ్లుగా కొనసాగిన విచారణ : చిగురుపాటి జయరాం మృతదేహాన్ని 2019 జనవరి 31న
అప్పటి కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో ఐతవరం వద్ద ఒక కారులో అక్కడి పోలీసులు
గుర్తించారు. ఏపీ పోలీసులు దర్యాప్తు చేసి జూబ్లీహిల్స్‌లోని రాకేశ్‌రెడ్డి
అద్దె నివాసంలో హత్య జరిగినట్లు తేల్చి కేసును తెలంగాణ రాష్ట్రానికి
బదిలీచేశారు. 2019 ఫిబ్రవరి 7న జూబ్లీహిల్స్ ఠాణాలో ఈ సంఘటనపై జయరాం మామ
పిచ్చయ్యచౌదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్లపై బెదిరింపులకు పాల్పడి : జూబ్లీహిల్స్ రోడ్ నంబరు
10లోని తన అద్దె ఇంటిలో హతమార్చాడు. ఇందుకు విస్లావత్ విశాల్(23),
రాకేశ్‌రెడ్డి అపార్ట్మెంట్ కాపలాదారు దున్నే శ్రీనివాస్, ఎస్సార్‌నగర్‌కు
చెందిన నీనావత్ నగేష్ సహకరించారు. అనంతరం మృతదేహాన్ని కారులో వేసుకొని
విజయవాడ వైపు వెళ్లారు. ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని
నందిగామ వైపు తీసుకెళ్లేందుకు అప్పటి నల్లకుంట ఇన్స్పెక్టర్
ఎస్.శ్రీనివాసులు, రాయదుర్గం ఇన్స్పెక్టర్ ఎం.రాంబాబు, ఇబ్రహీంపట్నం ఏసీపీ
సూరుకంటి మల్లారెడ్డి సాయం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ముగ్గురు
పోలీసు అధికారులతోపాటు కూర అంజిరెడ్డి, బండారి నర్సింహారెడ్డి, లక్ష్మీరెడ్డి
సుభాష్‌చంద్రారెడ్డి, పింగ్పాంగ్లతో పాటు మొత్తం 12 మందిని పోలీసులు ఈ
కేసులో నిందితులుగా చేర్చారు. రాకేశ్‌రెడ్డి ఓ వ్యక్తి ద్వారా సెల్‌ఫోన్‌ను
తీసుకొని జైలుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులతో కలిసి ఈ కేసును
వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లపై బెదిరింపులకు పాల్పడి పోలీసులకు
చిక్కాడు. ఈ కేసుపై దాదాపు నాలుగేళ్లపాటు విచారణ జరగగా చివరికి
రాకేశ్‌రెడ్డికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువడింది.