గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రజలు, పర్యాటకులకు మరింత చేరువ అయ్యేందుకు రెండు
స్పెషల్ ఆఫర్లను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)
ప్రకటించింది. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు టి-24 టికెట్‌ను ఇప్పటికే
అందజేస్తోన్న సంస్థ.. తాజాగా టి-6, ఫ్యామిలీ-24 పేరుతో కొత్త టికెట్లను
అందుబాటులోకి తీసుకువచ్చింది.
హైదరాబాద్ లోని బస్ భవన్ లో గురువారం టి-6, ఫ్యామిలీ-24 టికెట్ల పోస్టర్లను
టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు. ఈ టికెట్లు
శుక్రవారం నుంచి బస్ కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. మహిళలు,
సీనియర్ సిటిజన్ల సౌకర్యార్థం టి-6 టికెట్‌ను సంస్థ అందుబాటులోకి
తీసుకువచ్చింది. దీనిని రూ.50 చెల్లించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటి
ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ఆరు గంటల పాటు వారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా
ప్రయాణించవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే టి-6
టికెట్ చెల్లుబాటు అవుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ
టికెట్‌ను బస్సుల్లో కండక్టర్లు ఇస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత టి-6
టికెట్లను మంజూరు చేయరు. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు టి-6 టికెట్
వర్తిస్తుంది. టికెట్ తీసుకునే సమయంలో వయసు ద్రువీకరణ కోసం వారు ఆధార్
కార్డు చూపించాల్సి ఉంటుంది. వారంతాలు, సెలువు దినాల్లో కుటుంబ సభ్యులు,
స్నేహితులు కలిసి ప్రయాణించేందుకు వీలుగా ఫ్యామిలీ-24 టికెట్‌ను సంస్థ
అందుబాటులోకి తెచ్చింది. ఈ టికెట్‌కు రూ.300 చెల్లిస్తే.. నలుగురు రోజంతా సిటీ
ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఐదేళ్ల లోపు చిన్నారులకు ప్రయాణం
ఉచితం కాగా.. అంతకు పైబడిన వారు ఫ్యామిలీ-24 టికెట్ తీసుకోవచ్చు. శని,
ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో మాత్రమే ఈ ఆఫర్ ప్రయాణికులకు అందుబాటులో
ఉంటుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరిగే బస్సుల్లో టి-24
టికెట్‌ను సంస్థ అందజేస్తోంది. 24 గంటల పాటు ఆ టికెట్ చెల్లుబాటు అవుతుంది. ఆ
టికెట్ ధర పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.60గా ఉంది. “గ్రేటర్ హైదరాబాద్‌లో
తీసుకువచ్చిన టి-24 టికెట్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 33.38
కోట్ల మంది ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. వారిలో 55.50
లక్షల మంది టీ-24 టికెట్లను కొనుగోలు చేశారు. మహిళలు, సీనియర్ సిటిజన్స్, కుటుంబ
సభ్యులు, స్నేహితులు ఈ టికెట్లను వినియోగించుకోవాలి. టి-24 టికెట్ అయితే..
నలుగురు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. ఫ్యామిలీ-24తో ముగ్గురికి రూ.300
చెల్లించి నలుగురు ప్రయాణం చేయవచ్చు.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్,
ఐపీఎస్ గారు తెలిపారు.