హైదరాబాద్ : మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు కానుక
ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీలేని రుణాల కోసం రూ.750
కోట్లను విడుదల చేసింది. ఇందులో గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు రూ.500 కోట్లు,
పట్టణ సంఘాలకు రూ.250 కోట్లు అందనున్నాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో
ఈ పథకం అమలవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పేదరిక నిర్మూలన
సంస్థ(సెర్ప్) ద్వారా పట్టణాలు, నగరాల్లో మెప్మా ద్వారా ఈ పథకాన్ని
పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,31,025 సంఘాలు ఉన్నాయి. వాటిలో
46,10,504 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలోని వివిధ
బ్యాంకుల ద్వారా రూ.66,624 కోట్లను మహిళా సంఘాలు రుణాలుగా పొందాయి. వ్యవసాయం,
పాడి పరిశ్రమ, వ్యాపారం, స్వయం ఉపాధి, పేదరిక నిర్మూలన కార్యకలాపాల కోసం
తీసుకునే ఈ రుణాలను సకాలంలో వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లిస్తే… ప్రభుత్వం
ప్రోత్సాహకంగా వడ్డీ మొత్తాన్ని తిరిగి ఆయా సంఘాలకు అందిస్తోంది. తాజాగా
రూ.750 కోట్ల విడుదల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు
రూ.2561.77 కోట్లకు చేరాయి. మహిళలకు మేలు జరిగేలా పెద్ద మొత్తంలో నిధులను
విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్,
గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావులు
ధన్యవాదాలు తెలిపారు.
మహిళా ఉద్యోగులకు 8న సెలవు : అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకొని
ఈనెల 8న మహిళా ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను ప్రభుత్వం మంజూరు
చేసింది. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ ఇదివర్తిస్తుందని పేర్కొంటూ
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.