హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
మహిళలకు వడ్డీ లేని రుణాలను విడుదల చేస్తూ ఒక గొప్ప కానుక ఇచ్చిందని
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. 750 కోట్ల రూపాయల
భారీ నిధులను ఆడబిడ్డల కోసం విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి,
ప్రభుత్వానికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులలో 250 కోట్ల
రూపాయలు పట్టణ ప్రాంతాల మహిళల కోసం కాగా, 500 కోట్లు గ్రామీణ మహిళల
కోసమని మంత్రి తెలిపారు. ఈ మొత్తం 750 కోట్ల రూపాయల నిధులతో తెలంగాణ
రాష్ట్రంలో అటు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఉన్న మహిళా స్వయం సహాయక
సంఘాలకు భారీ ఎత్తున లబ్ధి చేకూరుతుందని దయాకర్ రావు అన్నారు. ఈ మేరకు మంత్రి
ఎర్రబెల్లి ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో 4 లక్షల 31 వేల 25 చిన్న సంఘాలు ఏర్పాటు
చేయడం జరిగింది. 46 లక్షల 10 వేల 504 కుటుంబాల మహిళలు చిన్నసంఘాలలో సభ్యులుగా
ఉన్నారు. ఇప్పటిదాకా గత ప్రభుత్వాలు స్వయం సహాయక సంఘాలకు 10 ఏండ్లలో 21 వేల
978 కోట్లు రుణాలు ఇస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు 8
ఏండ్లల్లో రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల ద్వారా 66 వేల 624 కోట్ల రూపాయలను
మహిళా సంఘాలకు రుణాలుగా ఇప్పించడం జరిగిందని మంత్రి వివరించారు. ఈ ఆర్థిక
సంవత్సరానికి 3 లక్షల 67 వేల 429 సంఘాలకు, 18వేల కోట్లు రుణ లక్ష్యంగా
నిర్ణయించడం జరిగింది. ఈ ఆర్ధిక సంవత్సరం ఇప్పటి వరకు 2 లక్షల 29 వేల 382
సంఘాలకు 14 వేల 47 కోట్ల 95 లక్షలు రుణాలుగా ఇప్పించడం జరిగింది. సగటున
ఒక్కొక్క సంఘానికి 6 లక్షల 12 వేల 425 బ్యాంకు రుణాలు ఇవ్వడం జరిగింది.
ఈనాటికి 17 వేల 565 కోట్లు, 3 లక్షల 80 వేల 994 సంఘాలపైన బ్యాంకు అప్పు నిల్వ
ఉన్నది అని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి
నుండి ప్రభుత్వం ఇప్పటివరకు వడ్డీలేని రుణాలుగా అర్హత కలిగిన 3 లక్షల 85 వేల
82 సంఘాలకు 2 వేల 561 కోట్ల 77 లక్షలు విడుదల చేసింది. దీని ద్వారా 46 లక్షల
20 వేల 984 సంఘ సభ్యులకు లాభం చేకూరింది. తెలంగాణ ప్రభుత్వం వడ్డీ లేని రుణాల
నిధులను పెద్ద ఎత్తున విడుదల చేయడంతో సిఎం కెసిఆర్ కి, ప్రభుత్వానికి మంత్రి
ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.