చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలపై వైద్యబృందాలకు ప్రశంసలు
హైదరాబాద్ : సర్కారు దవాఖానాల్లోనే అన్ని సౌకర్యాలు, వసతులు
కల్పిస్తున్నామని, పేదలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కావొద్దని
వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అత్యంత సంక్లిష్టమైన
గుండె సమస్యలతో బాధపడుతున్న తొమ్మిది మంది చిన్నారులకు బ్రిటన్ వైద్య బృందం
సహకారంతో నిమ్స్, నిలోఫర్ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్సలు చేసి మరో
జన్మ ప్రసాదించారని మంత్రి చెప్పారు. ఆస్పత్రిలోని చిన్నారుల వార్డును
పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జగిత్యాలకు చెందిన డాక్టర్
వెంకటరమణ దన్నపనేని బ్రిటన్‌లో గొప్ప వైద్యుడిగా స్థిరపడ్డారు. ఇటీవల నిలోఫర్
ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉషారాణి ద్వారా నన్ను కలిశారు. రాష్ట్రంలో అరుదైన
గుండె సమస్యలతో బాధపడుతున్న వారికి శస్త్రచికిత్సలు చేస్తానని చెప్పారు. నేను
కూడా వెంటనే అంగీకరించి నిమ్స్‌లో చేయాలని సూచించా. మూడు నెలల్లోనే అయిదుగురు
వైద్యబృందంతో ఇక్కడికి వచ్చారు. రోజుల వ్యవధిలోనే అరుదైన గుండె సమస్యలతో
బాధపడుతున్న 9 మంది చిన్నారులను గుర్తించాం. నిమ్స్ కార్డియో థొరాసిక్,
నిలోఫర్ వైద్యుల బృందంతో కలిసి ఒక్కో చిన్నారికి నాలుగైదు గంటల పాటు శ్రమించి
శస్త్రచికిత్సలను విజయవంతం చేశారు’ అని మంత్రి వివరించారు. ఇక్కడి వైద్య
బృందానికి కొన్ని మెలకువలతో శిక్షణ అందించారన్నారు. దేశంలో ఎయిమ్స్ తర్వాత ఈ
స్థాయిలో చికిత్సలు నిమ్స్‌లోనే సాధ్యమయ్యాయని చెప్పారు. నిమ్స్‌లో
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద కార్డియో థొరాసిక్ విభాగాన్ని
అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ప్రజల కోసం పనిచేస్తున్న మంత్రి హరీశ్‌రావు
రియల్ హీరో అంటూ బ్రిటన్ వైద్యుడు వెంకటరమణ ప్రశంసల జల్లు కురిపించారు. తాము
నిర్వహించిన శస్త్రచికిత్సల్లో పీడియాట్రిక్ వైద్యుడి నుంచి నర్సులు,
టెక్నీషియన్లు, సిబ్బంది ప్రత్యేక చొరవ చూపించారన్నారు. నెల రోజుల చిన్నారికి
ఎక్మో యంత్రం సాయంతో తొలిసారిగా శస్త్రచికిత్స చేశామని, దీనికి ప్రైవేటులో
రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అందోల్ ఎమ్మెల్యే
చంటి క్రాంతికిరణ్, నిమ్స్ ఇన్‌ఛార్జి డైరెక్టర్ నగరి బీరప్ప, మెడికల్
సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ, కార్డియో థొరాసిక్ విభాగాధిపతి
అమరేశ్వరరావు, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్, నిలోఫర్
ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉషారాణి, ప్రొఫెసర్ అలమేలు, నిమ్స్ కార్డియాలజీ
విభాగాధిపతి బి.శ్రీనివాస్, ఇతర వైద్యులు పాల్గొన్నారు.