వరంగల్ : వేధింపులకు గురై మృతిచెందిన వైద్య విద్యార్థిని ప్రీతి విషయంలో
కొందరు కావాలని రాజకీయాలు చేస్తున్నారని పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
కేటీఆర్ అన్నారు. నిందితుడు సైఫ్ అయినా, సంజయ్ అయినా వదలబోమని,
నిందితులెవరైనా కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వం, పార్టీ తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆమె
మృతి పట్ల సంతాపం ప్రకటించారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం షోడశపల్లిలో
రూ.104.98 కోట్లతో దేవాదుల పథకం కింద నిర్మించేందుకు ప్రతిపాదించిన మూడు
ఎత్తిపోతల పథకాలతోపాటు, ధర్మసాగర్ బండ్ సుందరీకరణ, స్థానికంగా పలు రహదారుల
నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో రాష్ట్రం ఏర్పడిందని, ఆ ఆకాంక్షల్ని
ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేరుస్తున్నారన్నారు. ఒక్క దేవాదులకే రూ.8 వేల కోట్లు
ఖర్చు పెట్టి కరవు ప్రాంతమైన జనగామ జిల్లాలో రెండు పంటలు పండేలా సస్యశ్యామలం
చేస్తున్నామని చెప్పారు. అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి దండిగా నిధులు
వెచ్చిస్తున్నామని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే కేసీఆర్‌ను
కాపాడుకోవాలని ప్రజలను కోరారు.
మోడీ దేవుడెలా అవుతారు? : ప్రధాని మోడీ ఒకే ఒక పని పెట్టుకున్నారని, ప్రజల్ని
దోచుకుంటూ మూటలు కట్టి, వాటిని పంచి ఓట్లు కొంటున్నారని మంత్రి కేటీఆర్
ఆరోపించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి అదానీ ఆదాయం రెట్టింపు
చేశారని ఆరోపించారు. మోడీ దేవుడని బీజేపీ నేతలు అంటున్నారని ప్రస్తావించి
రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు
పరిశ్రమ ఇలా ఏ ఒక్క హామీ నెరవేర్చని మోడీ ప్రజలకు దేవుడు ఎలా అవుతారని
ప్రశ్నించారు. అదానీకి మోడీ దేవుడని కేటీఆర్ తూర్పారబట్టారు. తాము ఏదైనా
మాట్లాడితే సీబీఐ, ఈడీ లాంటి వేటకుక్కలను ఉసిగొల్పుతున్నారని, తాము దేనికీ
భయపడమని కేటీఆర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడితే
మసీదులు కూలగొడతామంటారన్నారు. మసీదులు కూలగొట్టేవాడు ఎంపీయా? అని
ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణకు పట్టిన దరిద్రమన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పనికిమాలిన పాదయాత్రలు చేస్తూ
ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, చంద్రుడిలో మచ్చలు వెతికినట్టుగా
అసంపూర్తిగా ఉన్న చిన్నచిన్న పనులను ఎత్తి చూపుతూ ఒక్క ఛాన్స్ ఇవ్వండని
అడుక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పది
అవకాశాలు ఇచ్చినా అభివృద్ధి చేయాలనే సోయి ఎందుకు లేదని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీలు కడియం, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు ఐక్యంగా ఉండి
ఘన్‌పూర్‌ను అభివృద్ధి చేయాలని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా సూచించారు. మంత్రి
ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ రాబోయే కాలానికి
కాబోయే సీఎం కేటీఆర్ అంటూ వ్యాఖ్యానించారు.